ఏపీలో దిత్వా తుపాను.. ఉప్పల్ లో కాటేరమ్మ కొడుకు తుపాను
ఒక టి20 ఇన్నింగ్స్ లో 300 స్కోరు.. రెండు సీజన్లుగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల దూకుడు చూస్తే.. ఈ స్కోరు కొట్టేస్తారని అనిపించింది.;
12 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 32 బంతుల్లో సెంచరీ.. మొత్తం 52 బంతుల్లో 148 పరుగులు.. ఏకంగా 16 సిక్సులు.. 8 ఫోర్లు.. తొలి వికెట్ కు 205 పరుగులు.. ఇన్నింగ్స్ ముగిసేసరికి 310 పరుగులు..! ఇదేదో టెస్టుల్లోనో, వన్డే మ్యాచ్ ఇన్నింగ్సో కాదు..! టి20 మ్యాచ్ లో నమోదైన రికార్డులు..! అది కూడా మన హైదరాబాద్ ఉప్పల్ మైదానంలోనే. కొట్టింది కూడా ఎవరో కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడే విధ్వంసక బ్యాటర్. అంటే.. మన కాటేరమ్మ కొడుకు. దీంతో ఉప్పల్ ఊగిపోయింది..ఓవైపు ఏపీలో దిత్వా తుపాను ప్రభావం నెలకొంటే.. అంతకుమించిన ప్రభావం ఉప్పల్ రాజీవ్ గాంధీ మైదానంలో కనిపించింది. ఇదంతా సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నీలో కావడం విశేషం. ఉప్పల్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ కు అభిమానులకు ప్రవేశం ఉచితంగా కల్పించారు. దీంతో అంతర్జాతీయ క్రికెటర్ల ఆటను దగ్గరగా చూసే అవకాశం లభించింది.
ఐపీఎల్ లో సాధ్యం కానిది ముస్తాక్ అలీలో అయింది..
ఒక టి20 ఇన్నింగ్స్ లో 300 స్కోరు.. రెండు సీజన్లుగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల దూకుడు చూస్తే.. ఈ స్కోరు కొట్టేస్తారని అనిపించింది. 2024లో దగ్గరగా వచ్చినా చేరుకోలేదు. 2025లో తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపినా ఆ తర్వాత వెనకబడింది సన్ రైజర్స్. కానీ, తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సాధ్యమైంది. ఆదివారం పంజాబ్-పశ్చిమ బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్ల లో టీమ్ ఇండియా టి20 బ్యాటర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. సొంత రాష్ట్రం పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న అతడు 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ 310 పరుగులు చేసింది. ఈ టోర్నీ చరిత్రలో ఇది రెండో అత్యధికం. మొత్తమ్మీద నాలుగోది. అభిషేక్ రికార్డు స్థాయిలో 16 సిక్సులు, 8 ఫోర్లు బాదాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తనకు కోచింగ్ ఇచ్చే టీమ్ ఇండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.
షమీని ఉతికి ఆరేశాడు..
తన తుపాన్ ఇన్నింగ్స్ లో అభిషేక్.. టీమ్ ఇండియా పేసర్లు మొహమ్మద్ షమీ, ఆకాశ్ దీప్ లను ఉతికి ఆరేశాడు. షమీ 4 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చాడు. ఆకాశ్ 55 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మరో ఓపెనర్ ప్రబ్ సిమ్రన్ సింగ్ (35 బంతుల్లో 70, 8 ఫోర్లు, 4 సిక్సులు)తో కలిసి అభిషేక్ రికార్డు స్థాయిలో 205 పరుగులు జత చేశాడు. రమణ్ దీప్ సింగ్ (15 బంతుల్లో 39, 2 ఫోర్లు, 4 సిక్స్ లు), సన్వీర్ సింగ్ (8 బంతుల్లో 22) రాణించడంతో పంజాబ్ 300 దాటేసింది.
-పంజాబ్ భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో బెంగాల్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఆ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 66 బంతుల్లో 130 నాటౌట్ (13 ఫోర్లు, 8 సిక్సులు) అద్భుతంగా ఆడినా మిగతా బ్యాటర్లు ఎవరూ సహకారం అందించలేదు. ఆకాశ్ దీప్ (7 బంతుల్లో 35, 5 సిక్సులు) మెరుపులు మెరిపించినా బెంగాల్ 198 పరుగులకు పరిమితం అయింది.