ఇదేం ప్ర‌తిజ్ఞ సారూ.. ధ‌ర్మాన వ్యాఖ్య‌ల‌పై.. నెటిజ‌న్ల కామెంట్లు!

Update: 2022-10-23 09:00 GMT
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో  జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. సమర్థ నాయకుడైన జగన్‌ రాష్ట్రంలో అన్ని స్థానాలకు పొత్తులేకుండా పోటీ చేస్తారని తెలిపారు.

దమ్ముంటే పొత్తు లేకుండా రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ, జనసేన పార్టీలకు కృష్ణ‌దాస్‌ సవాల్‌ విసిరారు. 25 గ్రామాల ప్రజల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మూడు రాజధానులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ భావిస్తుంటే.. పవన్‌కల్యాణ్ టీడీపీకి వంతపాడుతున్నా రని దుయ్యబట్టారు. రాజకీయమంటే సినిమా కాదని పరిణతి కావాలని హితవు పలికారు. చంద్రబాబునాయుడు పైనా విమర్శలు గుప్పించారు.  రియ‌ల్ ఎస్టేట్ కోస‌మే చంద్ర‌బాబు రాజ‌ధాని కోసం పాకులాడుతున్నార‌ని.. కృష్ణ‌దాస్ వ్యాఖ్యానించారు.

అయితే.. కృష్ణ‌దాస్ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇదేం ప్ర‌తిజ్ఞ సారూ.. అని అంటున్నారు. ఎవ‌రైనా.. గెల‌వ‌క‌పోతే.. ప్ర‌తిజ్ఞ‌లు చేసిన వారుఉన్నార‌ని.. కానీ, గెలిచినా.. సీఎం కాక‌పోతే.. అంటూ.. కొత్త ప్ర‌యోగం చేస్తున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.అస‌లు త‌మ‌రు గెలిచే ఛాన్స్ ఉందా? అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం న‌ర‌స‌న్న‌పేట‌లో టీడీపీ హ‌వా పుంజుకుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా ఆ పార్టీ ముందుకు సాగుతోంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల మ‌ద్ద‌తుతో వారి ప్ర‌చారంతో గెలిచార‌ని గుర్తు చేస్తున్నార‌ని.. ముందు త‌మ‌రు గెలిస్తే.. చాల‌ని నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లే చెవులు కొరుక్కుంటున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News