వివేకా హ‌త్య‌!..సీబీఐ విచార‌ణ‌కు భ‌య‌మెందుకో?

Update: 2019-03-15 17:29 GMT
వైఎస్ వివేకానంద‌రెడ్డి... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి స్వ‌యానా త‌మ్ముడు. అన్న చ‌నిపోయే దాకా ఆయ‌న అడుగుజాడ‌ల్లోనే న‌డిచిన విశ్వ‌స‌పాత్రుడైన త‌మ్ముడు. పుట్టిన నాటి నుంచి అన్న‌తో సింగిల్ వివాదం కూడా లేకుండా న‌డుచుకున్న వ్య‌క్తి. అన్నంటే లెక్క‌లేనంత ప్రేమ క‌లిగిన నేతగా - అన్న మాటే వేద వాక్కుగా సాగిన నేత‌. అన్న క‌డ‌ప ఎంపీ అంటే అక్క‌డే - పులివెందుల ఎమ్మెల్యే సీటు అంటే అక్క‌డే... అన్న మాటే ఆయ‌న‌కు అంతిమ నిర్ణ‌యం. ఎమ్మెల్యేగా - ఎంపీగా - మంత్రిగా - ఎమ్మెల్సీగా వివేకా చాలా ప‌ద‌వుల‌నే చేప‌ట్టారు. అన్న అకాల మ‌ర‌ణంతో అన్న కొడుకు - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో కొంత‌కాలం పాటు దూరంగా ఉన్నా... అన్న కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నార‌న్న మాట తెలిసి విల‌విల్లాడిపోయారు. విభేదాల‌న్నీ ప‌క్క‌న‌పెట్టి... త‌న అన్న ప్ర‌తిరూపంగా ఉన్న జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరారు. జ‌గ‌న్ కుటుంబానికి అండ‌గా నిలిచారు. అన్న లేని లోటును తీర్చుతూ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు. త‌న అన్న మాదిరే త‌న అన్న కొడుకు వైఎస్ జ‌గ‌న్ ను కూడా సీఎంగా చూడాల‌న్న క‌సి నానాటికీ పెర‌గ‌గా... క‌ష్ట‌మైనా రంగంలోకి దిగి ప్ర‌చారం చేయాల్సిందేన‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు కూడా స‌మీపిస్తున్నాయి. దీంతో పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కొడుకు ఎన్నిక‌ల వ్యూహాల‌పై క‌స‌ర‌త్తులు చేస్తుంటే... త‌న‌వంతుగా సొంత జిల్లాలో ప్ర‌చారం చేసేందుకు వ‌చ్చిన రోజే ఆయ‌న దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ వార్త తెలుగు నేల‌లో పెను సంచ‌ల‌నం కాగా... వైఎస్ ఫ్యామిలీని తీవ్ర శోకంలో ముంచేసింది. ఎన్నిక‌ల వ్యూహాల క‌స‌ర‌త్తును వ‌దిలేసి ఉన్న‌ప‌ళంగా వైఎస్ జ‌గ‌న్ బాబాయిని చివ‌రి సారి చూసుకునేందుకు పులివెందుల‌కు రావాల్సి వ‌చ్చింది. స‌రే... ఓ మాజీ సీఎం త‌మ్ముడు - ప్ర‌స్తుతం ఏపీ విప‌క్ష నేత బాబాయిగానే కాకుండా మాజీ ఎమ్మెల్యే - మాజీ ఎంపీ - మాజీ మంత్రి - మాజీ ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించిన వివేకా లాంటి కీల‌క నేత హ‌త్యకు గురైతే... దానిపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐతో విచార‌ణ డిమాండ్ చేయ‌డం తప్పా? ఎంత‌మాత్రం కాదే. మ‌రి ఇప్పుడు అదే డిమాండ్ ను వినిపిస్తున్న వైసీపీ వాద‌న‌ను టీడీపీ ఎందుకు నిరాక‌రిస్తున్న‌ట్లు?

ఏ నేరం జ‌రిగినా - ఎంత పెద్ద నేరం జ‌రిగినా - ఏకంగా విప‌క్ష నేత‌పైనే హ‌త్యాయ‌త్నం జ‌రిగినా - కీల‌క నేత అయిన వివేకా హ‌త్య‌కు గురైనా కూడా సీబీఐ విచార‌ణ‌కు స‌సేమిరా అంటున్న టీడీపీ స‌ర్కారు అస‌లు ఉద్దేశ్యం ఏమిటి?  వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌నేనా?  ఘ‌ట‌న‌పై సంతాపం వ్య‌క్తం చేస్తూనే ఈ హ‌త్యకు గ‌ల వాస్త‌వ కార‌ణాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు సీబీఐ లాంటి సంస్థ‌తో విచార‌ణ‌కు ఎందుకు నిరాక‌రిస్తున్న‌ట్టు? అస‌లు సీబీఐ అంటేనే భ‌య‌ప‌డిపోతున్న‌ట్లుగా వ్య‌హ‌రించ‌డ‌మెంందుకు? అన్న అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏది జ‌రిగినా మొక్కుబ‌డిగా ఓ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) వేసి చేతులు దులుపుకుంటున్న చంద్ర‌బాబు స‌ర్కారు... వైఎస్ వివేకా హ‌త్య విష‌యంలోనూ అదే వైఖరిని అవ‌లంబిస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అస‌లు రాష్ట్రంలో ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబు స‌ర్కారు నియ‌మించిన సిట్లు ఏ మేర వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయో. స‌ద‌రు సిట్ల విచార‌ణ‌పై టీడీపీ నేత‌లే ఏ మేర పెద‌వి విరిచారో? ఇట్టే చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ నేప‌థ్యంలో వివేకా హ‌త్య‌పై విచార‌ణ‌కు సీబీఐ వ‌ద్దే వ‌ద్దంటూ కేవ‌లం సిట్ స‌రిపోతుంద‌న్న దిశ‌గా చంద్ర‌బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు నిజంగానే అనుమానాల‌ను రేకెత్తిస్తోంద‌ని చెప్పాలి.


Tags:    

Similar News