కాంగ్రెస్ గేరు మార్చే పనిలో షర్మిల...రాహుల్ ఓకే
ఏపీలో కాంగ్రెస్ కి మంచి రోజులు రావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఏపీలో రాజకీయంగా పతనావస్థకు చేరుకుని పుష్కర కాలం పూర్తి అయింది.;
ఏపీలో కాంగ్రెస్ కి మంచి రోజులు రావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఏపీలో రాజకీయంగా పతనావస్థకు చేరుకుని పుష్కర కాలం పూర్తి అయింది. 2014 ఫిబ్రవరి ఉమ్మడి ఏపీని రెండుగా విభజిస్తూ పార్లమెంట్ లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ టూ ప్రభుత్వం ఆమోదించిన బిల్లుతోనే ఏపీలో కాంగ్రెస్ పని అయిపోయింది అని తేలిపోయింది. మహామహులైన కాంగ్రెస్ నేతలు అంతా ఇతర పార్టీలలో సర్దుకున్నారు. వారి రాజకీయ జీవితాలు ఎలా ఉన్నా ఏపీలో హస్తం పార్టీకి ఖద్దరు హవాకు రోజులు పూర్తిగా చెల్లిపోయాయి.
మూడు ఎన్నికల్లో బొప్పి :
వరసగా చూస్తే 2014, 2019, 2024 ఇలా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కి తలబొప్పి కట్టింది. డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎదురైంది. ఈ మూడు ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి మధ్యనే పోరు సాగింది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ కూడా కోలుకోలేని దెబ్బ తిన్నది. కానీ ఆ పార్టీకి 40 శాతం ఓటు షేర్ వచ్చింది. అది ఆ పార్టీకి ధీమా అయితే గడచిన ఇరవై నెలల కాలంలో వైసీపీ యాక్టివిటీస్ పెద్దగా లేకపోవడం అసెంబ్లీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడం వంటి వాటి మూలంగా అనేక కీలక నిర్ణయాలలో విధానపరమైన గందరగోళం మూలంగానూ వైసీపీ వెనకబడుతోంది అని ప్రచారంలో ఉంది. ఎన్డీయే కూటమి ఏపీలో ఉంటే వైసీపీ ఇతర విపక్షాలను కలుపుకుని ఆల్టర్నేషన్ ఫ్రంట్ ని నిర్మించలేకపోతోంది. దానికి వైసీపీ కారణాలు దానికి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏపీలో రాజకీయ శూన్యత ఉందా అంటే ఉండొచ్చు అన్న భావనను కలుగజేస్తున్నాయి.
పోయిన చోటనే వెతుక్కుంటూ :
ఈ క్రమంలో పోయిన చోటనే వెతుక్కోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అందుకే వైఎస్సార్ బ్లడ్ అయిన వైఎస్ షర్మిలను తెచ్చి ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించారు. ఆమె గతంలో కొంత వరకూ ప్రయత్నించినా ఈ మధ్య తగ్గారు, అయితే తాజాగా ఆమె మళ్ళీ స్పీడ్ పెంచారు. ఇక షర్మిల రాజకీయ వైఖరిలోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఏకంగా కూటమినే విమర్శిస్తోంది. వైసీపీని పక్కన పెడుతోంది. ఇది కచ్చితంగా కాంగ్రెస్ కి కలసి వచ్చే అంశగా చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం ద్వారానే ఎక్కడైనా ఎవరైనా ప్రయోజనం పొందుతారు. కాంగ్రెస్ సరైనా రూట్ లోకే ఇపుడు వచ్చిందని అంటున్నారు.
రాహుల్ రాకతో :
తాజాగా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీని షర్మిల కలిశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆమె స్వయంగా ఆయనను ఆహ్వానించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కోరుతోంది. ఏపీ కాంగ్రెస్ అయితే దీని మీద రాష్ట్ర స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ఫిబ్రవరి 2న జరిగే ఆందోళనలో పాల్గొనాలని షర్మిల కోరిన మేరకు రాహుల్ ఓకే చెప్పారు సరిగ్గా 20 ఏళ్ళ క్రితం వైఎస్సార్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నుంచే జాతీయ ఉపాధి హామీ పధకాన్ని ప్రారంభించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ అనంతపురం జిల్లా బండ్లపల్లి వచ్చి మరీ ఈ పధకానికి శ్రీకారం చుట్టారు. దాంతో అక్కడ నుంచే కాంగ్రెస్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని షర్మిల నిర్ణయించి రాహుల్ ని ఆహ్వానించారు. ఇక మీదట ఏపీలో కాంగ్రెస్ గేర్ మార్చి జోరు పెంచుతుందని అంటున్నారు.