ఈయూ ఇండియా సూపర్ డీల్ - వీటి ధరలు తగ్గుతాయి

మిగిలిన దేశాల మాదిరిగా గంభీరమైన ప్రకటనలు చేయలేదు, అలాగే బెంబేలెత్తి పోలేదు, అదే సమయంలో అమెరికా బ్లాక్ మెయిల్ వ్యూహాలకు లొంగనూ లేదు, నెమ్మదిగా ప్రపంచంలోని ఇతర దేశాల వైపు భారత్ చూసింది;

Update: 2026-01-28 03:30 GMT

అమెరికా కన్నెర్రకు తిరుగులేని జవాబు భారత్ ఇచ్చింది. మిగిలిన దేశాల మాదిరిగా గంభీరమైన ప్రకటనలు చేయలేదు, అలాగే బెంబేలెత్తి పోలేదు, అదే సమయంలో అమెరికా బ్లాక్ మెయిల్ వ్యూహాలకు లొంగనూ లేదు, నెమ్మదిగా ప్రపంచంలోని ఇతర దేశాల వైపు భారత్ చూసింది. ఇంతకు ముందు చేరని చోటుకు అడుగు పెట్టని ప్రాంతానికి కదిలింది. అలా తన వాణిజ్యాన్ని విస్తరించింది. కొత్త ఒప్పందాలకు తెర తీసింది.

అమెరికాకు షాక్ :

భారత్ మౌనం వెనక ఏముందో అర్ధం కాని అమెరికాకు ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య ఒప్పందంతో షాక్ ఇచ్చేసింది భారత్. ఈయూ ఇండియా సూపర్ డీల్ మొత్తం ఒప్పందాలకే అమ్మ కాదు అమ్మమ్మ అని అంటున్నారు. అందుకే నరేంద్ర మోడీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ఎందుకంటే మొత్తం ప్రపంచ జీడీపీలో 25శాతం వాటా ఉన్న డీల్‌ గా ఇది ఉంది. ఇక ఈ సూపర్ డీల్ తో అటు ఈయూకు ఇటు ఇండియాకు ఎంతో మేలు కలుగుతోంది. అలా రెండు పక్షాలకూ భారీ అవకాశాలు విస్తృత ప్రయోజనాలూ కలిగించే ఈ సూపర్ డీల్ ని చూసిన తరువాత అగ్రే దేశం నిజంగా ఖంగు తిన్నదని అంటున్నారు వాణిజ్య నిపుణులు.

ఈ రంగాలలో మేలు :

యూరోపియన్ యూనియన్ ఈయూలో ఏకంగా 27 దేశాలు ఉన్నాయి. అవన్నీ కూటమిగా ఉన్నాయి. ఇక భారత్ ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ గా ఉంది. దాంతో రెండు వైపులా మేలు చేకూరేలా ఈ సూపర్ డీల్ కుదిరింది. దీంతో భారతదేశంలోని తయారీ రంగానికి మంచి బూస్ట్ వస్తుంది. అదే విధంగా సేవా రంగానికి సైతం ఊతం లభిస్తుంది అన్నది వాణిజ్య రంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న విశ్లేషకుల మాటగా ఉంది.

మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ :

అవును ఈ ఒప్పందం మొత్తం ప్రపంచంలో ఇప్పటిదాకా కుదిరిన అన్ని ఒప్పందాలకూ బాహుబలి లాంటిది అని అంటున్నారు అలా ఈయూ ఇండియాల మధ్యన ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీద మోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదన్నది నిజమే అనిపిస్తుంది. ఈయూ ఇండియాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలన్నది 2007 నాటి ప్రతిపాదన. అది కాస్తా 2013 నాటికి ఇబ్బందులో పడింది. 2022లో తిరిగి పురుడు పోసుకుంది ఈ రోజున ఇది కార్యరూపం దాలుస్తోంది. దాంతో ఇండియన్ ఎనర్జీ వీక్ సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ జనవరి 27 న 27 దేశాల కూటమి అయిన ఈయూతో ఒప్పందం అన్నది ఎంతో శుభప్రదం అన్నారు. ఈ ఒప్పందం మూలంగా భారత్ లోని 140 కోట్ల మంది ప్రజలకూ అలాగే ఈయూ దేశాలలో ఉండే లక్షలాది ప్రజలకు అపారమైన అవకాశాలు దక్కుతాయని ఆశభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు వాటా ఈ ఒప్పంద పరిధిలోకి వస్తుందని నరేంద్ర మోడీ చెప్పడం విశేషం.

ఇవన్నీ అందుబాటులోకి :

ఇక ఈ సూపర్ డీల్ ద్వారా భారత్‌లోని టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యూవెలరీ, లెదర్ వస్తువుల వంటి రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అంతే కాదు, సేవా తయారీ రంగాలలో కూడా అందుబాటులోకి అన్నీ వస్తాయి. సర్జికల్ సామగ్రి, క్యాన్సర్ సహా ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మందులు ఇవన్నీ కూడా భారత్ కి మరింత చౌకగా లభిస్తాయి. ఈ సూపర్ డీల్ తో భారత్ నుంచి 99 శాతం ఎగుమతులు ఈ 27 దేశాలకు వెళ్తాయి. అలాగే ఆ దేశాల నుంచి 97 శాతం దిగుమతులు భారత్ లోకి వస్తాయి.

Tags:    

Similar News