వైఎస్సార్ సీఎం కాకుండా 2004లో టీడీపీ గెలిచి ఉంటే ?

కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండదు, ఊహా జనితాలు. అయితే అలా జరిగి ఉంటే అన్నది ఎపుడూ ఉంటూ ఉంటుంది.;

Update: 2026-01-28 02:45 GMT

కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండదు, ఊహా జనితాలు. అయితే అలా జరిగి ఉంటే అన్నది ఎపుడూ ఉంటూ ఉంటుంది. ఈ ప్రశ్నను ఈ రకమైన ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇపుడు సంధించారు. అంతే కాదు ఒక్కసారి పాతికేళ్ళ క్రితం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళి మరీ గతాన్ని తవ్వి తీశారు. టీడీపీకి వరస విజయాలు దక్కి ఉంటే అని ఆయన అంటూ ఏకంగా 2004, 2009 ఎన్నికలను ఉదహరించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కమిటీ బాధ్యులకు నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ ఈ రకమైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆ జోరు అలాగే అంటూ :

చంద్రబాబు 1995లో తొలిసారి సీఎం అయ్యారు. ఆయన 2004 వరకూ ఏకంగా తొమ్మిదేళ్ళ పాటు నిరాటంకంగా పాలించారు. 2004లో తొలిసారి ఓటమిని చవి చూశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. వైఎస్సార్ సీఎం అయ్యారు. ఇక 2009లో చూస్తే మరోసారి కాంగ్రెస్ గెలిచింది. 2014 నాటికి విభజన జరిగింది. ఏపీలో తొలి ప్రభుత్వం టీడీపీదే అయింది. ఇక 2019లో చూస్తే మళ్ళీ ఓటమి టీడీపీకి ఎదురైంది. 2024లో బంపర్ విక్టరీ కొట్టింది. అయితే ఈసారి మాత్రం డే వన్ నుంచి టీడీపీ పెద్దలు ఒక్కటే చెబుతున్నారు. ఈ విజయం అయిదేళ్ళు కాదు దశాబ్దాల పాటు కొనసాగాలని. ఇప్పుడు కూడా పార్టీ వేదిక మీద బాబు అదే చెప్పారు.

మొదటి నుంచీ అంటూ :

ఇప్పటిదాకా చంద్రబాబు 2019లో ఓడకుండా ఉంటే ఏపీ దశ తిరిగేది అని అమరావతి ఆగేది కాదని పోలవరం పూర్తి అయ్యేదని చెబుతూ వచ్చారు కానీ తొలిసారి 2004, 2009 ఎన్నికల గురించి విభజన ఏపీలో ప్రస్తావించారు. ఆయన చాలా వెనక్కి వెళ్ళారు. 2004లోనూ 2009లోనూ టీడీపీయే గెలిచి ఉంటే ఏపీ మరోలా ఉండేది అన్నారు. అంటే అప్పట్లో కాంగ్రెస్ గెలవకపోతే వైఎస్సార్ సీఎం అయ్యేవారు కాదు, అలాగే టీడీపీ 2009లో గెలిచి ఉంటే బహుశా విభజన ప్రస్తావన వచ్చేదా అన్నది కూడా ఉందేమో. అందుకే ఏపీ అభివృద్ధి బ్రహ్మాండంగా సాగేది అని బాబు చెప్పుకొచ్చారు.

జగన్ దాకా రాదా :

అంతే కాదు వైఎస్సార్ సీఎం కాకపోతే వైఎస్ జగన్ ఆయన పార్టీ వైసీపీ కూడా ఉండేవి కావు అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి బాబు చాలా లోతుగానే వెళ్లి ఈ కామెంట్స్ చేశారా అన్న చర్చ వస్తోంది. అయితే రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షలు అన్నవి చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని బట్టే రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అవి అనుకూలంగా మారినా మరి కొన్ని సార్లు రివర్స్ గేర్ వేస్తాయి. ఇవన్నీ బాబుకు తెలియనివి కావు అనే అంటున్నారు.

గుజరాత్ మోడల్ అంటూ :

గుజరాత్ లో బీజేపీ దశాబ్దాలుగా గెలుస్తూ వస్తోంది. దానికి కారణం అక్కడ బీజేపీ పటిష్టమైన నాయకత్వం అంతే కాదు క్యాడర్ అంకిత భావం, పార్టీ వ్యూహాలు ప్రభుత్వ అభివృద్ధి విధానాలు ఇవన్నీ కూడా గుజరాత్ లో కమల వికాసాన్ని శాశ్వతం చేశాయి. దాంతో చంద్రబాబు అదే మాట అంటున్నారు అయితే గుజరాత్ లో రెండు జాతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ వీక్ కావడంతో గుజరాత్ మీద ఆ ప్రభావం గట్టిగా పడుతోంది మరో వైపు ఆర్ఎస్ఎస్ బలమైన నేపధ్యమూ బీజేపీకి వరంగా మారుతోంది.

దక్షిణాదికి ఆ తేడా :

ఏపీలో చూస్తే జనాలలో రాజకీయ చైతన్యం ఎక్కువ అని చెబుతారు. వారు తడవకో పార్టీని మారుస్తారు. అది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాదు, దక్షిణాదిన అంతటా అలాగే ఉంది. తమిళనాడు కానీ కర్ణాటక కేరళ ఎక్కడ చూసినా ఒక ఎన్నికలో ఒక పార్టీ గెలిస్తే మరో ఎన్నికలో ఇంకో పార్టీని గెలిపిస్తారు. ఇక్కడ అభివృద్ధి ప్రమాణంగా ఎన్నికలు జరిగే దాని కంటే రాజకీయం మీద ఓటర్ల చైతన్యం మీద ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఉత్తరాదికీ దక్షిణాదికి ఆ తేడా అని అంటారు. మరి బాబు గుజరాత్ మోడల్ అంటున్నారు. చూడాల్సిందే.

Tags:    

Similar News