వెయ్యి కోట్ల ఆరోపణను తెరపైకి తెచ్చిన వైఎస్సార్సీపీ!

Update: 2019-03-21 16:43 GMT
ఒకవైపు చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారని అంటూ ఉన్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ ను విలన్ గా చూపి రాజకీయ ప్రయోజనాలు పొందాలని బాబు ప్రయత్నిస్తూ ఉన్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల ముందు తెరాసతో పొత్తు కోసం  తీవ్రంగా ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు ఆ పొత్తు పొడవకపోయే సరికి.. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏపీ రాజకీయంలో కేసీఆర్ ను విలన్ గా చిత్రీకరించి  లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు బాబు.

ఈ ప్రయత్నాలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు. అయితే చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయల ఆరోపణను మాత్రం గట్టిగా చేస్తూ ఉన్నారు.

అయినా.. జగన్ సొంతంగా లక్ష కోట్ల రూపాయలు సంపాదించేశారు… తండ్రిని అడ్డం పెట్టుకుని  లక్ష కోట్ల రూపాయలను జగన్ దోచేశారు.. అని ఆరోపించే తెలుగుదేశం పార్టీ మరీ సిల్లీగా వెయ్యి కోట్ల రూపాయల ఆరోపణను తీసుకురావడం ఏమిటో. లక్ష కోట్ల రూపాయలను సొంతంగానే కలిగి ఉన్నాడు జగన్.. అని ఆరోపించే తెలుగుదేశం పార్టీ - ఇదే సమయంలో వెయ్యి కోట్ల రూపాయలు..అంటే అందులో  వందో వంతు సొమ్ము కోసం కేసీఆర్ మీద ఎందుకు ఆధారపడ్డారో.. తెలుగుదేశం పార్టీనే చెప్పాలి.

 ఆ సంగతలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో వెయ్యి కోట్ల రూపాయల ఆరోపణను తెర మీదకు తీసుకు వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు - పవన్ కల్యాణ్ ల విషయంలో. ఏపీలో ప్రస్తుత ఎన్నికల్లో నిలబడేందుకు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీని ఇస్తున్నారని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఈ ఎన్నికల్లో తన పార్టీని నిలబెట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే పవన్ కల్యాణ్ పని అని, అందుకోసం బాబు వెయ్యి కోట్ల రూపాయల మొత్తాన్ని పవన్ కు ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడుచుకొంటూ రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది.
Tags:    

Similar News