ఫుల్ క్లారిటీ; పట్టిసీమకు జగన్ వ్యతిరేకమంట

Update: 2015-09-04 07:09 GMT
ఏపీ అధికారపక్షం సూటిగా వేసిన ప్రశ్నకు.. విపక్ష నేత అదే స్థాయిలో అంతే సూటిగా సమాధానం చెప్పేశారు. సీమ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నట్లు చెబుతున్న పట్టిసీమ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ అనుకూలమా? వ్యతిరేకమా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలంటూ ఏపీ అధికారపక్ష నేతలు నిలదీయటం తెలిసిందే.

దీనికి వెనువెంటనే సమాధానం చెప్పని వైఎస్ జగన్.. శుక్రవారం అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు తాను వ్యతిరేకమని జగన్ తేల్చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు గతంలోనే తాను చెప్పానని చెప్పిన జగన్.. ఈ విషయాన్ని మరోసారి తాను స్పష్టం చేస్తున్నట్లు వెల్లడించారు.

పట్టిసీమలో స్టోరేజ్ లేదని.. ఈ ప్రాజెక్టుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేశారని.. టెండర్లలో 21శాతం ఎక్కువగా కోట్ చేసిన వారికి టెండర్ ని కట్టబెట్టటంతో పాటు.. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు గోదావరి నదీ జల వివాదాల ట్రిబ్యునల్ కిందకు వెళుతుందని.. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో తెలంగాణ సర్కారు తనకు 45 టీఎంసీల నీరు అడుగుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించటం అంటే.. సీమ ప్రయోజనాల్ని దెబ్బ తీసినట్లుగా ఏపీ అధికారపక్షం అభివర్ణిస్తున్నా.. జగన్ మాత్రం తాను ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకమేనని తేల్చి చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News