డకౌట్ నుంచి తెలివిగా తప్పుకున్న జగన్

Update: 2016-02-06 06:45 GMT
ఒక అడుగు వెనక్కి వేయటం అంటే.. తనకున్న శక్తిసామర్థ్యాల్ని కూడకట్టుకొని మరింత వేగంగా లఘించటం కోసమేనన్న విషయం కొంతమందికి బాగా తెలుసు. రాజకీయంగా వరుస తప్పులు చేస్తారన్న పేరున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సూపర్ గా ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ సునామీతో విపక్షాలు కకావికలమైన పరిస్థితి. తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షాలు దారుణమైన ఓటమిని మూటగట్టుకొని ఎన్నికల బరిలో ఎందుకు నిలిచామా అని భావిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ముందుగా ఊహించారో ఏమో కానీ జగన్.. గ్రేటర్ ఎన్నికల బరిలో దిగకుండా జాగ్రత్త పడ్డారు. తెలంగాణలో తమ పార్టీ బలం అంతంతమాత్రమేనన్న విషయం జగన్ కు తెలియంది కాదు. 2104 సార్వత్రికఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదన్న విషయాన్ని గుర్తించిన జగన్.. ముందు జాగ్రత్తగా గ్రేటర్ బరిలో నిలవలేదు.

గ్రేటర్ బరిలో దిగకపోవటాన్నిపలువురు ప్రశ్నించినా.. తాజాగా విడుదలైన ఫలితాల్ని చూసిన వారంతా జగన్ ముందుచూపును ప్రశంసిస్తున్నారు. ఒకవేళ జగన్ కానీ గ్రేటర్ బరిలో అభ్యర్థుల్ని దింపితే దారుణ అవమానానికి గురై ఉండేవారన్న వాదన వినిపిస్తోంది. ఏపీ అధికారపక్షానికి ఒక డివిజన్.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు రెండు డివిజన్లు.. బీజేపీకి నాలుగు డివిజన్లు సొంతం చేసుకోగా.. జగన్ పార్టీ కానీ బరిలోకి దిగి ఉంటే.. డకౌట్ అయ్యేదన్న మాట వినిపిస్తోంది. అలాంటి భారీ అవమానాన్ని ముందస్తుగా ఊహించి జగన్ ఎస్కేప్ అయ్యారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News