ఏపీలో యువ శ‌క్తి.. జాతీయ స‌గ‌టుకన్నా అధికం!

Update: 2021-06-27 14:30 GMT
‘‘యువతరం శిరమెత్తితే.. నవతరం గళమెత్తితే.. లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా..?’’ అన్నాడో సినీ కవి. నిజమే.. యువతకు ఉన్న శ‌క్తి అలాంటిది. ఉక్కు కండ‌లు.. ఇనుప కండ‌రాలు క‌లిగిన యువ‌తే ఈ దేశానికి కావాల‌న్నాడు శ్రీ శ్రీ. అలాంటి వాళ్లు కావాల్సినంత మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్నార‌ని తేల్చింది తాజా నివేదిక‌.

అవును.. ఏపీలో యువ‌త సంఖ్య‌ చాలా ఎక్కువ‌గా ఉంద‌ని సివిల్ రిజిస్ట్రేష‌న్స్ స‌ర్వే తేల్చింది. అది కూడా ఎంతంటే.. జాతీయ స‌గ‌టుక‌న్నా అధికంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. 20 నుంచి 24 సంవ‌త్స‌రాల లోపు యువ‌కులు 2 కోట్ల 12 ల‌క్ష‌ల 92 వేల 205 మంది ఉన్నారు.

తాజా.. స‌ర్వే ప్ర‌కారం దేశంలో 133.89 కోట్ల జ‌నాభా ఉన్న‌ట్టు తేలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 5.23 కోట్ల మంది జ‌నం ఉన్న‌ట్టు నిర్ధార‌ణ జ‌రిగింది. ఇందులో 40.7 శాత మంది  20 నుంచి 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. కానీ.. జాతీయ స‌గ‌టు కేవ‌లం 37.9 శాత‌మే కావ‌డం విశేషం.

దేశం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. అభివృద్ధిలో ముందుకు సాగాలంటే యువ‌శ‌క్తే కీల‌కం. అవ‌కాశాలు ఎన్ని ఉన్నా, వ‌న‌రులు మ‌రెనెన్ని ఉన్నా.. వాటిని ఉత్పాద‌క శ‌క్తిగా మ‌ల‌చ‌డంలో, త‌ద్వారా అభివృద్ధి వైపు న‌డిపించ‌డంలో యువ‌కులే కీల‌కం. 45 సంవ‌త్స‌రాల పైబ‌డిన వారిలో ప‌నిచేసే సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది. 20 ఏళ్ల క‌న్నా త‌క్కువ‌గా ఉన్న‌వారు ఇంకా ‘ప‌ని మంతులు’ కానట్టు లెక్క.

కాబట్టి.. పై రెంటి మ‌ధ్యలో ఉన్న యువ‌తే అభివృద్ధికి కీల‌కం. ఈ వ‌ర్క్ ఫోర్స్ ను స‌రిగా ఉప‌యోగించుకున్న రాష్ట్రాలు, దేశాలే అభివృద్ధి వైపు ప‌రుగులు పెడ‌తాయి. మ‌రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఈ వ‌న‌రును ఎలా ఉప‌యోగించుకుంటుంది? అన్న‌దానిపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News