ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు.. సైబర్ బందిపోట్ల కొత్త ఎత్తు!
ఎప్పటికప్పుడు వినూత్న ఎత్తుగడలతో ఎదుటోళ్ల బలహీనల్ని సొమ్ము చేసుకునే సైబర్ బందిపోట్లు తాజాగా మరోకొత్త ఎత్తుకు తెర తీశారు.;
ఎప్పటికప్పుడు వినూత్న ఎత్తుగడలతో ఎదుటోళ్ల బలహీనల్ని సొమ్ము చేసుకునే సైబర్ బందిపోట్లు తాజాగా మరోకొత్త ఎత్తుకు తెర తీశారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని.. చదివినంతనే ఇట్టే టెంప్టు అయ్యేలా ప్లాన్ చేశారు. ఈ ఉచ్చులో పడిన పలువురు మగాళ్లు బాధితులుగా మారుతున్నారు. పిల్లలు లేని మహిళలతో సెక్సులో పాల్గొని.. వారిని గర్భవుతుల్ని చేస్తే.. రూ.10 లక్షలు నజరానాగా ముట్టచెబుతామని చేస్తున్న మోసపూరిత ప్రకటనలకు పలువురు చిక్కుకుంటున్నారు.
ఫేస్ బుక్.. వాట్సాప్ వేదికగా చేసుకొని ఇస్తున్న ఈ మోసపూరిత ప్రకటనలు ఇప్పుడు బిహార్ లో ఎక్కువగా ఉంటున్నాయి. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ అని.. ఆలిండియా ప్రెగ్నెంట్ సర్వీసు పేరుతో ఈ కొత్త ట్రాప్ ను విసురుతున్నారు సైబర్ దొంగలు. ఈ ఉద్యోగాలు కేవలం పురుషులకు మాత్రమే అని పేర్కొంటూ.. భారీగా డబ్బులు మాత్రమే కాదు మహిళలతో సెక్సు చేసే అవకాశం ఉంటుందని ఆకర్షిస్తూ.. వారిని రాంగ్ రూట్ లోకి తీసుకెళ్లి.. అడ్డంగా బుక్ చేస్తున్నారు.
సంతానం లేని మహిళలను గర్భవతుల్ని చేస్తే రూ.పది లక్షలు వస్తాయని.. ఒకవేళ గర్భవతి కాకున్నా సగం డబ్బుతోపాటు.. సుఖం దక్కుతుందంటూ ఇట్టే ట్రాప్ లో పడే ప్రకటనల జోరు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ప్రకటనలకు ఆకర్షితులై.. సైబర్ నేరస్తుల్ని సంప్రదించినంతనే దోపిడీ మొదలవుతుందని పోలీసులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలని.. హోటల్ బుకింగ్స్.. ఇతర ఖర్చుల కోసమంటూ డబ్బులు పిండుతారని పోలీసులు చెబుతున్నారు. తాను మోసపోయానని గ్రహించేలోపే బాధితుడు భారీగా నష్టపోతాడని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ప్రభావితం కావొద్దని పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఈ తరహా కేసులో ఒక మైనర్ ను బిహార్ పోలీసులు అరెస్టు చేయటం గమనార్హం. మనిషి బలహీనతల్ని లక్ష్యంగా చేసుకొని వల విసిరి అంశాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీకేర్ ఫుల్.