మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ బాధితురాలే.. ఎలా జరిగిందంటే..!

నిన్నటి వరకూ ఎంతోమంది సామాన్యులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, ఐటీ ప్రొఫెషనల్స్ తో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత సైతం సైబర్ క్రైమ్ బాధితులుగా ఉన్న సంగతి తెలిసిందే.;

Update: 2026-01-11 07:20 GMT

నిన్నటి వరకూ ఎంతోమంది సామాన్యులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, ఐటీ ప్రొఫెషనల్స్ తో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత సైతం సైబర్ క్రైమ్ బాధితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైతం ఈ సైబర్ వలలో చిక్కుకున్నారని.. ఈమె నుంచి రూ.2.58 కోట్లు కొల్లగొట్టారని అంటున్నారు. ఈ విషయం సంచలనంగా మారింది.

అవును.. దేశంలోనే అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన సీబీఐ కి జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిన లక్ష్మీనారాయణ కుటుంబం సైతం సైబర్ వలలో చిక్కుకుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చి, సంచలనంగా మారింది. ఇందులో భాగంగా.. లక్ష్మీనారాయణ సతీమణి ఉర్మిళ నుంచి ఏకంగా రూ.2.58 కోట్లను సైబర్ నేరగాళ్లు పక్కాగా ప్లాన్ చేసి, భారీగా ఆశచూపి కొట్టేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్...!

2025 నవంబరులో ఉర్మిళకు.. తాము చెప్పినట్లుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయంటూ వాట్సాప్ కు ఒక మెసేజ్ వచ్చింది. దీంతో.. ఆ మెసేజ్ ను నమ్మిన ఆమె.. సైబర్ నేరగాళ్లు సూచించిన 'స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సైంజ్ - 20' అనే వాట్సాప్ గ్రూపులో తన భర్త లక్ష్మీనారాయణ నెంబరును యాడ్ చేయించారు. అందుకు కారణం... ఆమెకు ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవటమే అని చెబుతున్నారు.

అక్కడితో సైబర్ నేరగాళ్ల ప్లాన్ వర్కవుట్ ప్రారంభమైందని భావించొచ్చు. దీంతో.. ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా.. ఆమె గ్రూపులో చేరిన కాసేపటికే దినేష్ సింగ్ అనే వ్యక్తి లైన్ లోకి వచ్చి, ఆమెతో మాట్లాడాడు. ఇందులో భాగంగా... తాను ట్రేడింగ్ ట్రైనింగ్ అధికారిని అని.. ఐఐటీ ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అమెరికాలో పీహెచ్డీ చేశానని చెప్పాడు. అక్కడితో ఆగకుండా.. తాను రాసిన 'స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్' పుస్తకాన్ని త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు.

దీంతో.. అతడి మాటలను నమ్మిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య ఊర్మిళ.. అతను చెప్పినట్లు నడుచుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో వాట్సప్ ద్వారా అతడు పెట్టుబడులకు సంబంధించి పలు సిఫార్సులు చేసినట్లు చెబుతున్నారు. అనంతరం.. తాను చెప్పినట్లు పెట్టుబడి పెడితే 500% లాభాలు వస్తాయని చెప్పేవాడట. ఆమెకు మరింత నమ్మకం కలిగించే కార్యక్రమంలో భాగంగా.. దినేష్ చిట్కాలను పాటించి తాను భారీగా లాభాలు సంపాదించినట్లు ప్రియసఖి అనే మహిళ ఆ గ్రూపులో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది.

దీంతో... 2025 డిసెంబరు 24 నుంచి 2026 జనవరి 5 మధ్యలో 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేసేలా చేశాడు దినేష్. దీనికోసం తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుని.. ఆమె ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఖాతాలో లాభాలు కనిపిస్తున్నాయి కానీ.. వాటిని విత్ డ్రా చేసే ఆప్షన్ మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో.. అవి విత్ డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆ బ్యాచ్ సూచించింది. దీంతో.. ఫైనల్ గా తాను మోసపోయినట్లు గుర్తించిన ఊర్మిళ.. సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ వ్యవహారంపై విచారణ మొదలు పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు!

Tags:    

Similar News