ఇంటర్ దాకా తెలుగు తప్పనిసరి...కూటమి డెసిషన్

తెలుగులో ఇంటర్ వరకూ అంతా చదివి తీరాల్సిందే అని కచ్చితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే ఒక బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది అని చెప్పారు.;

Update: 2026-03-01 04:24 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి కీలకమైన అడుగులు వేస్తోంది. తెలుగు భాషని కాపాడుకునేందుకు కార్యాచరణను రూపొందిస్తోంది. తెలుగు భాష ఈ దేశంలో ఎక్కువ మంది మాట్లాడే రెండవ భాష. ఏకంగా 18 నుంచి 20 కోట్ల మంది తెలుగు మాట్లాడుతారు. అయితే రాను రానూ తెలుగులో మాట్లాడడం చదవడం బాగా తగ్గిపోతోంది. దాంతో తెలుగు వెలుగులు విహీనం అవుతున్నాయి. తెలుగు భాష అంటే మాట పాట పద్యం గద్యం సాహిత్యం ఇలా ఎన్నో ఉన్నాయి. అలాంటి అందమైన భాషను పరిరక్షించుకోవాలని ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహిస్తున్నారు. ఇదే ఏడాది జనవరి నెలలో గుంటూరు వేదికగా తెలుగు మహా సభకు జరిగాయి. ఇపుడు అమలాపురం కోనసీమ జిల్లాలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు మొదలయ్యాయి. రెండు రోజుల పాటు సాగుతున్నా ఈ సభకు గౌరవ అతిధిగా హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలుగు భాష కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది అని చెప్పారు.

తెలుగు చదవాల్సిందే :

తెలుగులో ఇంటర్ వరకూ అంతా చదివి తీరాల్సిందే అని కచ్చితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే ఒక బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది అని చెప్పారు. ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా కచ్చితంగా బోధించాలన్నది కూటమి ప్రభుత్వం విధానంగా ఆయన వెల్లడించారు. అలా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు తప్పనిసరి చేసేలా చట్టం చేస్తున్నామని అన్నారు. దీని వల్ల తెలుగు భాష కచ్చితంగా భవిష్యత్తులో మరింతగా జవ జీవాలతో అలరారుతుందని ఆయన అన్నారు.

ప్రవాసంలోనే తెలుగు :

ఇదిలా ఉంటే తెలుగు ఎక్కడ ఉంది అంటే ఇతర దేశాలలోనే అని స్పీకర్ అయ్యన్న చెప్పడం విశేషం. తాను ఇటీవల చాలా దేశాలు పర్యటించాను అని ఆయన చెప్పారు. అయితే ఆ దేశాలలో ఉన్న మన తెలుగు వారి ఇళ్ళలో చక్కగా తెలుగు మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు తెలుగు భాష తెలుగు సంస్కృతి అక్కడ ఎక్కువగా కనిపిస్తోంది అని అన్నారు. కానీ సొంత గడ్డ మీద మాత్రం తెలుగు భాష మాట్లాడేవారు తగ్గిపోతున్నారని ఇది అత్యంత బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి కడుపులో నుంచి ఈ భూమి మీదకు వచ్చే శిశువు పలికే మొదటి మాట అమ్మ అని ఆయన చెప్పారు. అలాంటి అమ్మ భాషను కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని అన్నారు. తల్లితండ్రులు తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని తెలుగులో మాట్లాడించాలని ఆయన కోరారు. మొత్తానికి తెలుగు భాష పట్ల కూటమి ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధకు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News