మూడు నెలలు మాడిపోవడమేనట !
ఈసారి ఎండలు మహోగ్ర రూపం చూపించనున్నాయి అని భారత వాతావరణ శాఖ ఐఎండి స్పష్టం చేస్తోంది.;
ఈసారి ఎండలు మహోగ్ర రూపం చూపించనున్నాయి అని భారత వాతావరణ శాఖ ఐఎండి స్పష్టం చేస్తోంది. గత ఏడాది వేసవి కంటే ఈసారి వేసవి దారుణంగా ఉంటుందని కూడా అంచనా కడుతోంది. ఈ వేసవిని తట్టుకోవడం బహు కష్టం అని ఐఎండీ సూచనలు చూస్తే కనుక అర్ధం అవుతోంది. ఆందోళన సైతం పెరుగుతోంది. నిజానికి చూస్తే ఏ ఏటికి ఆ ఏడు ఎండలు దారుణంగా పెరిగిపోతున్నాయి. మంటెక్కిస్తునాయి. సూర్యుడు భూమికి మరీ దగ్గరగా వస్తున్నాడా అన్న భయం కూడా కలుగుతోంది. ఎండలతో భారీ ఎత్తున పెరిగే ఉష్ణోగ్రతలు జనాలను కాల్చుకుని తింటున్నాయి. అయితే అన్ని ఏడాదులు వేరు, 2026 వేరు అని ఐఎండీ గట్టిగా చెబుతోంది.
మార్చి నుంచి మే దాకా :
ఐఎండీ సూచనల ప్రకారం చూస్తే కనుక 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకూ అంటే మూడు నెలల పాటు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మార్చి నెలలో సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడి అవుతోంది.
వడగాడ్పులు అధికం :
సాధారణంగా చూస్తే మే నెలలో వడగాడ్పులు ఉంటాయి. అది కూడా రోహిణి కార్తెలలో ఉంటాయి. అగ్ని కార్తెలు రోహిణి కార్తెలు అన్నవి రెండూ మే నెల ఎండలను మండించి భూమిని అగ్ని గోళంగా మారుస్తాయి. ఆ సమయంలో వడ గాడ్పులు సైతం గాఢంగా వీచి వేడిని రెట్టింపు చేస్తాయి. అయితే ఈసారి మాత్రం వడ గాడ్పులు మామూలు కంటే అధికంగా ఉండడమే కాకుండా ఎక్కువ రోజులు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. సెన్ట్రల్ ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెబుతోంది.
తగిన జాగ్రత్తలతో :
వేసవి ఎండలు అంటే మామూలుగా ఈసారి ఉండవు కాబట్టి తగిన జాగ్రత్తలతో ఉండాలని సూచనలు ఉన్నాయి. ఎండతీవ్రత వడగాల్పులకు గురికాకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని ముందస్తు జాగ్రత్తలు గురించి ఏపీ విపత్తుల ససంథ తెలియచేస్తోంది. టోపీ, కర్చీఫ్, తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను సిద్ధం చేసుకోవాలని, అదే విధంగా కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలని చెబుతోంది. ఇక ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలని అంటోంది. మేడపైన మొక్కలతో పాటు ఇంట్లో కూడా మొక్కలు అంటే ఇండోర్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసుకుంటే భవనాన్ని చల్లగా ఉంచుతాయని చెబుతున్నారు. అవే ఉష్ణ తాపాన్ని తగ్గిస్తాయి. ఇంటి పరిసరాలలో సైతం మొక్కలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఇక వంటగది తలుపులు, కిటికీలను తీసి వుంచితే తగినంత గాలి వచ్చే విధంగా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.