అమెరికాలో ఘోరం.. మిసిసిపీలో కాల్పుల కలకలం.. చిన్నారితో సహా ఆరుగురు బలి!

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ మారణకాండ వెస్ట్ పాయింట్ సమీపంలోని సిడర్ బ్లఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.;

Update: 2026-01-11 04:47 GMT

అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పడగ విప్పింది. మిసిసిపీ రాష్ట్రంలోని క్లే కౌంటీలో శనివారం రాత్రి జరిగిన వరుస కాల్పుల ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక ఏడేళ్ల చిన్నారితో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రక్తసిక్తమైన మూడు ప్రాంతాలు

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ మారణకాండ వెస్ట్ పాయింట్ సమీపంలోని సిడర్ బ్లఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులపై నిందితుడు తొలుత దాడికి పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత మరో రెండు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన నిందితుడు అక్కడ ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఈ మొత్తం ఉదంతంలో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. నిందితుడి బుల్లెట్లకు ఒక 7 ఏళ్ల చిన్నారి కూడా బలవ్వడం.

నిందితుడి అరెస్ట్

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన క్లే కౌంటీ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. చివరికి ఒక రోడ్డు చెక్‌పాయింట్ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

దర్యాప్తులో తేలాల్సిన విషయాలు

ఈ దారుణానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు. నిందితుడికి బాధితులకు మధ్య ఏవైనా పాత గొడవలు ఉన్నాయా? లేక ఇది ఉన్మాదంతో చేసిన చర్యా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గాయపడిన పలువురు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కుటుంబ సభ్యులు, చిన్నారులు టార్గెట్‌గా జరిగిన ఈ కాల్పుల ఘటన అమెరికాలో భద్రత, ఆయుధ నియంత్రణపై మళ్లీ చర్చకు దారితీసింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Similar News