ఎల్లో మీడియా జర్నలిస్టులకు యాజమాన్యం ఆ హెచ్చరికలు!

Update: 2019-05-30 15:21 GMT
మొన్నటి వరకూ తెలంగాణలో మాత్రమే మొగుడు ఉండేవాడు - ఇప్పుడు ఏపీలో కూడా రెడీ అయ్యాడు.. కాబట్టి కాస్త ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని వార్తలు రాయండి..' అంటూ తమ జర్నలిస్టులకు హెచ్చరికల్లాంటివి జారీ చేశాయట ఎల్లో మీడియా వర్గాలు. ఇన్నేళ్లూ వేరు - ఇప్పుడు వేరు..అనే లెక్కలతో అప్పుడే వారు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయని సమాచారం.

తెలంగాణలో కేసీఆర్ - ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు అధికారంలోకి రావడంతో కొన్ని మీడియా వర్గాలకు చేతులు కట్టేసినట్టు అయ్యింది. ఆ మీడియా వర్గాలు ఏ మాత్రం కోరుకోని పరిణామాలు ఇవి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ నెగ్గకూడదని - ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ముఖ్యమంత్రి కాకూడదని వారు గట్టిగా పోరాడారు! చంద్రబాబు భజనను పతాక స్థాయిలో చేశారు. ఆ మీడియా వర్గాలే చంద్రబాబును కాపాడతాయని ఆయన పార్టీ వారు అనుకున్నారు.  అయితే మీడియా ఎన్నికల ఫలితాలను ఏ మాత్రం ప్రభావితం చేయలేదని మరోసారి రుజువు  అయ్యింది. ఇక సదరు మీడియా వర్గాలు ప్రత్యేకించి జగన్ ను ఎంతలా లక్ష్యంగా చేసుకుంటూ వచ్చాయో అందరికీ తెలిసిన సంగతే. జగన్ మీద బోలెడంత విష ప్రచారాన్ని చేశారు. ఉన్నవీ లేనివీ రాస్తూ జగన్ ను దెబ్బతీయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబుకు జాకీలు వేసి లేపుతూ - జగన్ ను అణగదొక్కాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు..అనేక మీడియా సంస్థలకు కేవలం జగన్ ను దెబ్బతీయాలనే ప్రయత్నమే తప్ప మరో ఉద్దేశమే లేకుండా పోయింది. అలానే ఐదేళ్లు - అంతకు ముందు నాలుగేళ్లు గడిచాయి!

ఇప్పుడు జగన్ చేతికి అధికారం అందింది. ఇప్పటికే ఆ మీడియా వర్గాలకు జగన్ సూటిగా సుత్తి లేకుండా హెచ్చరికలు జారీ చేశారు. తప్పుడు కథనాలు రాస్తే వదిలే ప్రసక్తి ఉండదని జగన్ తేల్చి చెప్పారు. ఆ మీడియా వర్గాలు ఎక్కడ దొరుకుతాయా.. అనే అంశం గురించి కూడా జగన్ ఎదురుచూసే అవకాశం ఉంది.

తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ ఆ మీడియా వర్గాలకు కొద్ది వరకూ నట్లు బిగించారు. ఇప్పుడు జగన్ ఏపీలో సీఎం కావడంతో ఆ మీడియా వర్గాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని పని చేయాలని, తామై తాము  జగన్ కో - కేసీఆర్ కో దొరికే పరిస్థితిని తీసుకురావద్దని తమ సిబ్బందికి ఎల్లో మీడియా వర్గాలు గట్టిగానే చెప్పాయని భోగట్టా!


Tags:    

Similar News