పాక్ లో వలసలు 'ప్రొఫెషనల్ బిచ్చగాళ్ల'కే పరిమితం కాలేదు.. షాకింగ్ డేటా!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అనధికారిక నియంతృత్వ పాలనలో ఆ దేశం అన్ని విధాలా దివాలా తీసేస్తుందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-27 14:30 GMT

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అనధికారిక నియంతృత్వ పాలనలో ఆ దేశం అన్ని విధాలా దివాలా తీసేస్తుందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు ప్రత్యేకంగా అతని కోసమే చేసినట్లు చెబుతున్న ఆ దేశ 27వ రాజ్యాంగ సవరణ అనంతరం పాక్ ప్రజాస్వామ్య దేశం అని కొద్దో గొప్పో మిగిలిన ఉన్న ఆశలూ పోయాయని అంటున్నారు. ఈ సమయంలో పాక్ ను వదిలి వెళ్తున్న ఆ దేశ ప్రొఫెషనల్స్ డేటా సంచలనంగా మారింది.

అవును... ఓ పక్క దేశీయ నిషేధిత జాబితాలు, మరోవైపు విదేశీ ప్రభుత్వాల కఠినమైన హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయని వేలాది మంది పాకిస్థానీలు భిక్షాటన కోసం విదేశాలకు ప్రయాణిస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఇస్లాం రెండు పవిత్ర స్థలాలను కలిగి ఉన్న సౌదీ అరేబియా.. భిక్షాటన కోసం వచ్చిన సుమారు 56,000 మంది పాకిస్థానీలను బహిష్కరించిందని.. ఈ విషయాన్ని పాకిస్థాన్ కూడా ధృవీకరించిందని వారలొచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు.. వ్యవస్థీకృత భిక్షాటన ముఠాలు విదేశాలకు వలస వెళ్లకుండా నిరోధించే క్రమంలో ఈ ఏడాది సుమారు 66,154 మంది ప్రయాణికులను ఆఫ్ లోడ్ చేసినట్లు పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. అయితే పాకిస్థాన్ నుంచి వలసలు కేవలం ప్రొఫెషనల్ బిచ్చగాళ్లకే పరిమితం కాలేదని.. డాక్టర్స్, ఇంజినీర్స్ వంటి ప్రొఫెషనల్స్ కూడా పెద్ద ఎత్తున పాకిస్థాన్ ను వదిలి, విదేశాలకు వలస వెళ్లిపోతున్నారని తాజా లెక్కలు తెరపైకి వచ్చాయి.

ఇందులో భాగంగా... పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌ మెంట్ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం... 2024లో 7,27,381 మంది పాకిస్తానీలు విదేశీ ఉపాధి కోసం నమోదు చేసుకోగా.. ఈ ఏడాది నవంబర్ వరకు 6,87,246 మంది నమోదు చేసుకున్నారు. సుమారు ఈ 24 నెలల్లోనూ నమోదు చేసుకున్న వీరిలో 5,000 మంది వైద్యులు.. 11,000 మంది ఇంజనీర్లు.. 13,000 మంది అకౌంటెంట్లను ఉన్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో... ఈ వలసలు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని, దాని ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను ఎగతాళి చేస్తున్నట్లు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ తాజా ఘణాంకాలు.. పాకిస్థాన్ లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఇదే క్రమంలో 2011 - 224 మధ్య పాకిస్థాన్ లో నర్సుల వలసలు ఏకంగా 2,144 శాతం పెరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2025లో కూడా ఇలాంటి ధోరణే కొనసాగిందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లపై తీవ్ర విమర్శలు, వ్యంగ పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ మద్దతుదారుడు సాజిద్ సికందర్ అలీ... పాక్ లో పరిశ్రమలు లేవు, పరిశోధనలకు నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, ఖాళీ ప్రయోగశాలలు, మూసేసిన మార్కెట్లు ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి అన్నారు. ప్రతిభను అవకాశాలు సృష్టించడం ద్వారా మాత్రమే ఆపగలరని.. బెదిరించి కాదని నొక్కి చెప్పారు.

Tags:    

Similar News