2025: ఏపీలో వివాదాలు - విషాదాలు.. !
వ్యక్తి జీవితం మంచి-చెడుల మిశ్రమం. అలానే.. 2025 కూడా ఏపీకి కొన్ని మంచి పనులు చేసి పెడితే.. అదే సమయంలో కొన్ని వివాదాలను-విషాదాలను కూడా మోసుకు వచ్చింది.;
వ్యక్తి జీవితం మంచి-చెడుల మిశ్రమం. అలానే.. 2025 కూడా ఏపీకి కొన్ని మంచి పనులు చేసి పెడితే.. అదేసమయంలో కొన్ని వివాదాలను-విషాదాలను కూడా మోసుకు వచ్చింది. ప్రధానంగా ఆలయాల వద్ద భక్తుల భద్రత వ్యవహారం వివాదంగా మారింది. ఈ ఏడాది తిరుపతి వైకుంఠద్వార దర్శనానికి వచ్చిన భక్తులు తొక్కిసలాట కారణంగా 8 మంది మృతి చెందారు. సింహాచలం అప్పన్న చందనోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు మృత్యువాత పడ్డారు.
ఇక, రహదారి ప్రమాదాలు.. బాలికలపై అత్యాచారాల వంటి ఘటనలు కూడా రాష్ట్రాన్ని ప్రభావితం చేశా యి. కర్నూలులో జరిగిన ప్రైవేటు ట్రావల్స్ బస్సు.. ఘోర అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణి కులు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా బాలికలు, మహిళల భద్రతకు కూటమి సర్కారు ప్రాధాన్యం ఇచ్చినా.. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
ఇక, రాజకీయంగా చూసుకుంటే.. క్షేత్రస్థాయిలో ఇసుక, మద్యం వ్యవహారాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాయి. సొంత పార్టీలకు చెందిన నాయకులే.. ఈ వ్యవహారంలో ఉండడంతో ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. అదేసమయంలో విజయవాడ ఎంపీ వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్రీనివాసరావుల మధ్య చెలరేగిన వివాదం ఒకటి రెండు రోజులు టీడీపీని కుదిపేసింది. అదేవిధంగా విశాఖలో కూటమి నాయకుల మధ్య ఏర్పడిన భూముల వివాదం కూడా.. ఉత్తరాంధ్రలో చర్చనీయాంశం అయింది.
అలాగే.. కర్నూలు జిల్లాకు చెందిన ఓ టీడీపీ నాయకురాలు.. సుధారాణి ఎన్నికలకుముందు సొమ్ములు ఇచ్చానన్న వ్యవహారం కూడా చర్చనీయాంశం అయింది. ప్రధానంగా ప్రభుత్వ విధానాల విషయంలో ఒకింత ఆందోళన వ్యక్తమైనా.. తర్వాత సర్దుకుంది. విద్యుత్ చార్జీలను తొలుత పెంచినా.. తర్వాత ఉపసంహించారు. అదేసమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచినా.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించి వెనక్కి తగ్గారు. ఇక, ఎన్నికలకు ముందు వైసీపీపై ఎలాంటి దూకుడు ప్రదర్శించారో.. ఆ దూకుడును ఈ ఏడాది కూడా కొనసాగించడం విశేషం.