అసెంబ్లీకి కేసీఆర్.. ఒక్క రోజేనా? వేటు త‌ప్పించుకునే ఎత్తుగ‌డా?

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి...ప‌దేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లి రెండేళ్లు పూర్త‌య్యాయి.;

Update: 2025-12-27 17:30 GMT

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి...ప‌దేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లి రెండేళ్లు పూర్త‌య్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ స‌ర్కారు ఎన్నిసార్లు స‌వాల్ విసిరినా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజ‌రుకాలేదు. ఈ రెండేళ్ల‌లో కేసీఆర్ శాస‌న స‌భ‌కు వ‌చ్చింది ఒకే ఒక్క‌సారి. అదికూడా ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేసేందుకే. ఆ వెంట‌నే కేసీఆర్ ఎన్న‌డూ లేని విధంగా అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇక తాము ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని ప్ర‌ళ‌యం రేపుతామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, త‌ర్వాత అసెంబ్లీకి రాలేదు. సీఎంగా ఉన్న ప‌దేళ్ల‌లో మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌ని కేసీఆర్.. ప్ర‌తిప‌క్ష నేత‌గా అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడి రాజ‌కీయాల ప‌ట్ల కాస్త ఆస‌క్తి రేపినా దాదాపు ఏడాదిన్న‌ర నుంచి స్త‌బ్దుగానే ఉన్నారు. అయితే, ఈ నెల 29 నుంచి జ‌ర‌గ‌నున్న తెలంగాణ శాస‌న స‌భ స‌మావేశాల‌కు ఆయ‌న హాజ‌రుకావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే, అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ వ‌ర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనే అరుదైన స‌న్నివేశాన్ని చూసే అవ‌కాశం ద‌క్కుతుంది.

మంట రేపిన పాల‌మూరు..

సీఎం రేవంత్ సొంత జిల్లా ఉమ్మ‌డి పాల‌మూరు. అలాగే కేసీఆర్ ఒక‌ప్పుడు ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించిన జిల్లా పాల‌మూరు. 2009లో ఆయ‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఆ హోదాలోనే తెలంగాణ సాధించారు. ఇక రేవంత్ టీడీపీ త‌ర‌ఫున 2009లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ లో చేరారు. సీఎం అయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో రేవంత్ ను టార్గెట్ చేశారు. ప‌లు కేసులు న‌మోదు చేశారు. రేవంత్ కాంగ్రెస్ లోకి వ‌చ్చాక 2018 త‌ర్వాత రాజ‌కీయ విభేదాలు మ‌రింత తీవ్రం అయ్యాయి. 2023లో బీఆర్ఎస్ ను ఓడించి రేవంత్ సీఎం అయి త‌న చిర‌కాల కోరిక నెర‌వేర్చుకున్నారు. అయితే, రేవంత్ సీఎం అయి కేసీఆర్ ప్ర‌తిప‌క్ష నేత‌గా మారాక అసెంబ్లీలో ఇద్ద‌రూ త‌ల‌ప‌డితే ఎలా ఉంటుందో చూడాల‌ని చాలామంది భావించారు. ఇప్పుడు దీనికి పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం అవ‌కాశం క‌ల్పించేలా ఉంది. ఈ ప్రాజెక్టు అంశ‌మై జ‌రుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిల‌దీయాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

ఎజెండా చూసి..

అసెంబ్లీలో పాల‌మూరు ఎత్తిపోత‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్ర‌భుత్వం అసెంబ్లీ స‌మావేశాల ఎజెండా చూసి చూసి ముందుకెళ్దామ‌ని ఆయ‌న పేర్కొన్న‌ట్లు స‌మాచారం. అంతేకాక పాల‌మూరు ఎత్తిపోత‌ల‌పై అసెంబ్లీ బ‌య‌ట కూడా పోరాటం సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై అసెంబ్లీ త‌ర్వాత పాల‌మూరు జిల్లా కేంద్రం స‌మీపంలోని మండ‌లంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని కూడా కేసీఆర్ ఆలోచ‌న చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఎన్ని రోజులు అసెంబ్లీకి వ‌స్తారో?

అసెంబ్లీకి గైర్హాజ‌రుతో కేసీఆర్ పై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌నే వాద‌న గ‌తంలో వినిపించింది. దీనికి సంబంధించి చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సోమ‌వారం అసెంబ్లీకి హాజ‌రై వేటు ముప్పును త‌ప్పించుకునే చాన్సుంది. అయితే, స‌మావేశాలు 15 రోజులు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయాలంటూ ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ నిర్దేశించారు. ఇక‌ ఆయ‌న స్వ‌యంగా ఎన్ని రోజులు స‌మావేశాల్లో పాల్గొంటారో చూడాలి.

Tags:    

Similar News