'రెహమాన్ కు పాకిస్థాన్ చేయలేనిది బాలీవుడ్ చేసింది'!
తాజాగా ఈ సినిమా, అందులోని గ్యాంగ్ స్టర్ పాత్రపై స్పందించిన న్యాయవాది, బలూచ్ జాతీయవాది అయిన హబీబ్ జాన్ బలూచ్... ఈ సినిమాను తాను ఇప్పటికే రెండు సార్లు చూసినట్లు చెప్పారు.;
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ తాజా సంచలనం "ధురంధర్" సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు సరిహద్దులు దాటి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. జే & కే లోని కొన్ని కీలక ప్రాంతాల్లో సైతం జనాలను థియేటర్లకు రప్పించిన సినిమా ఇది. ప్రస్తుతం దీని కలెక్షన్ లు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఈ సినిమాలోని అక్షయ్ ఖన్నా పోషించిన పాత్ర గురించి ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఆదిత్య ధర్ తాజా సంచలనం "ధురంధర్" ఓ కల్పిత రచనే కావొచ్చు కానీ.. అది వాస్తవికతలో లోతుగా పాతుకుపోయిన పరిస్థితి. అందుకే ఈ సినిమాకు అంత ప్రజాధరణ వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమా ప్రధానంగా పాకిస్థాన్ లోని కరాచీలోగల లియారీ అనే ప్రాంతంలో సెట్ చేయబడింది. ఇది 2000ల ప్రారంభంలో గ్యాంగ్ వార్ లకు ప్రసిద్ధి చెందింది. ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ రెహమాన్ డకోయిట్ గా అక్షయ్ ఖన్నా నటించారు.
ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన పాత్ర అదే పేరుతో నిజ జీవితంలోలో ఉన్న గ్యాంగ్ స్టర్ ఆధారంగా రూపొందించబడింది. ఆ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సమయంలో నిజ జీవితంలో ఆ గ్యాంగ్ స్టర్ రెహమాన్ స్నేహితుడు తాజా ఆ చిత్రాన్ని చూసి, స్పందించారు. ఈ సందర్భంగా నిజ జీవితంలో రెహమాన్ క్యారెక్టర్ గురించి చెబుతూ.. అతనికి పాక్ రుణపడి ఉందని తెలిపారు.
తాజాగా ఈ సినిమా, అందులోని గ్యాంగ్ స్టర్ పాత్రపై స్పందించిన న్యాయవాది, బలూచ్ జాతీయవాది అయిన హబీబ్ జాన్ బలూచ్... ఈ సినిమాను తాను ఇప్పటికే రెండు సార్లు చూసినట్లు చెప్పారు. ఇదే సమయంలో.. తాను ఆ పాత్రపై వ్యాఖ్యానించను కానీ.. ఈ సినిమాలో మరిన్ని పాటలు ఉంటే బాగుండేది అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా... పాకిస్థాన్ చేయలేనిది భారతదేశ బాలీవుడ్ చేసిందని.. అందుకు బాలీవుడ్ కి థాంక్స్ అని అన్నారు.
అయితే ఈ సినిమాలో చూపించినట్లుగా రెహమాన్ జీవితంలో విలన్ కాదని.. అతనొక హీరో అని హబీబ్ తెలిపారు. "అతను ఒక హీరో.. మంచి వ్యక్తి. వాస్తవానికి పాకిస్థాన్ అతనికి రుణపడి ఉంది.. రెహమాన్, ఉజరి బలూచ్ లేకపోయి ఉంటే పాకిస్థాన్ ఈ రోజు మరో బంగ్లాదేశ్ లాగా లేదా అంతకంటే దారుణ పరిస్థితుల్లో ఉండేది" అని హబీబ్ బలూచ్ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి!
కాగా... ఈ ధురంధర్ సినిమాలో 2000లో లియారిలో రెహమాన్ డకోయిట్ గ్యాంగ్ లోకి చొరబడే భారతీయ గూఢచారి పాత్రను రణవీర్ సింగ్ పోషించారు. లియారి టాక్స్ ఫోర్స్ కు నాయకత్వం వహించిన నిజ జీవిత పోలీసు అధికారి కరాచీ ఎస్పీ చౌదరి అస్లాం పాత్రను సంజయ్ దత్ పోషించారు. ఇదే క్రమంలో.. మాధవన్, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది!