'పాదయాత్ర' వేవ్ వస్తుందా..? తమ్ముళ్ల చర్చలు.. !
వైసీపీ అధినేత జగన్.. పాదయాత్ర వ్యవహారం... ఆ పార్టీలో కంటే కూడా.. టీడీపీ నేతల మధ్య ఎ క్కువగా చర్చకు వచ్చింది.;
వైసీపీ అధినేత జగన్.. పాదయాత్ర వ్యవహారం... ఆ పార్టీలో కంటే కూడా.. టీడీపీ నేతల మధ్య ఎ క్కువగా చర్చకు వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు.. పాదయాత్రపై చర్చిస్తున్నారన్నది మీడియా వర్గాల మధ్య జరుగుతున్న చర్చ. కొందరు పాదయాత్రవేవ్ పెద్దగా ఉండదని కొట్టి పారేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల కు హాజరైన ఎమ్మెల్యేల మధ్య సొంత పార్టీ అంశాలకంటే కూడా.. వైసీపీ వ్యవహారాలపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే కాకుండా.. క్యాంటీన్లలోనూ వైసీపీపై చర్చ సాగుతోంది.
పలువురు నాయకులు వేవ్ ఉండదని అంటున్నారు. మరికొందరు మాత్రం.. ఉండే అవకాశం ఉంటుంద ని వ్యాఖ్యానించారు. సహజంగానే.. జగన్‌పై ఉన్న సానుభూతి వర్కవుట్ అయ్యే అవకాశం ఉంటుందని తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కానీ.. ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అలాం టిదేమీ ఉండదని.. లోకేష్.. పవనాస్త్రం పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. ఇక, మరికొందరు ఎమ్మెల్యేలు.. తమ తమ ప్రాంతాల్లో సర్వేలు చేయించినట్టు తెలిపారు.
''నేను ఓ సర్వే వాళ్లను అడిగా. యూట్యూబ్‌లో కూడా వాళ్లు సర్వే చేశారు. జగన్ పాదయాత్రపై ప్రభావం ఎంతో ఉండదని చెబుతున్నారు.'' అని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. నెల్లూరులో ఈ విషయం హాట్ టాపిక్‌గా ఉందని.. మంత్రి నారాయణ ఇటీవల మీడియా మిత్రులతో వ్యాఖ్యానించారు. '' ఎవరి టాపిక్‌లు వారివి. మేం అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు ఫేం మాకు ఉపయోగపడుతుంది. వారికి పాదయాత్రపై ఇంట్రస్ట్ ఉంది. అదే చర్చిస్తున్నారు'' అని చెప్పుకొచ్చారు.
ఈ తరహా చర్చ.. ఉత్తరాంధ్ర నాయకుల మధ్య కూడా ఉంది. అయితే.. ఎంత వేవ్ వచ్చినా.. బలమైన కూ టమి ముందు పెద్దగా ఫలించే అవకాశం ఉండదని నాయకులు చెబుతున్నారు. కానీ.. ఎన్నికల ఫైట్ మాత్రం భీకరంగానే ఉంటుందని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల మధ్య పాదయాత్ర టాపిక్ వస్తున్న విషయం సీఎం చంద్రబాబు చెవిలో కూడా పడడంతో ఆయన సీరియస్ అయ్యారని తెలిసింది. ఇలాంటి అర్ధంపర్ధం లేని విషయాలు కట్టిపెట్టాలని.. ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు వివరించాలని ఆయన సూచించినట్టు తెలిసింది.