బ్యాంకు అకౌంట్ 25 వేలకి అద్దెకివ్వడం ఏంటి ?
స్టాక్ మార్కెట్, క్రికెట్ బెట్టింగ్‌ల పేరుతో జరిగిన ఈ రూ. 550 కోట్ల భారీ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి ..;
నెలకు పదివేల రూపాయలు సంపాదించే వ్యక్తి అకౌంట్‌లో వందల కోట్ల రూపాయలు ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి విడ్డూరంగా ఉన్నా, అహ్మదాబాద్‌లో జరిగిన ఒక భారీ హవాలా కుంభకోణంలో ఇదే నిజమైంది. కేవలం రూ. 10 వేల జీతానికి పనిచేసే ఒక సామాన్య ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. స్టాక్ మార్కెట్, క్రికెట్ బెట్టింగ్‌ల పేరుతో జరిగిన ఈ రూ. 550 కోట్ల భారీ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి ..
డ్రైవర్ ఖాతాలో రూ. 300 కోట్ల మాయాజాలం: అహ్మదాబాద్‌కు చెందిన ప్రదీప్ అనే యువకుడు ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 10 నుండి 12 వేలు సంపాదిస్తుంటాడు. అయితే, అతని బ్యాంకు ఖాతాను నిశితంగా పరిశీలించిన ఈడీ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిశాయి. ఒక సామాన్యుడి అకౌంట్ ద్వారా ఏకంగా రూ. 300 కోట్ల మేర ట్రాన్సాక్షన్స్ జరగడం చూసి అధికారులు షాక్ అయ్యారు. విచారణలో ప్రదీప్ అసలు విషయం బయటపెట్టాడు. ఇక తనకు తెలిసిన కిరణ్ అనే వ్యక్తికి తన బ్యాంకు ఖాతాను కేవలం రూ. 25 వేల కోసం అద్దెకు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఇలా సామాన్యుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు కోట్లలో హవాలా వ్యాపారం సాగిస్తున్నారు.
బెట్టింగ్, స్టాక్ మార్కెట్ పేరుతో భారీ స్కామ్:
ఇక ఈ కుంభకోణం కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించి, వాటి ద్వారా అక్రమ క్రికెట్ బెట్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో దాదాపు రూ. 550 కోట్ల హవాలా సొమ్మును చేతులు మార్చారు. ఇక పన్ను ఎగవేయడానికి మరియు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి ఈ ముఠా ఇలాంటి తెలివైన ప్లాన్ వేసింది. ప్రదీప్ లాంటి అమాయకులను మభ్యపెట్టి వారి ఖాతాలను వాడుకుంటూ, అసలైన నిందితులు మాత్రం తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు.
జాగ్రత్త.. మీ అకౌంట్ అద్దెకు ఇస్తున్నారా:
ఈ ఘటనతో సామాన్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేవలం కొద్దిపాటి కమిషన్ ఆశ చూపగానే చాలామంది తమ ఆధార్, పాన్ కార్డు వివరాలను ఇతరులకు ఇచ్చి బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. ఇక ఇలా చేయడం వల్ల తెలియకుండానే భారీ ఆర్థిక నేరాల్లో భాగస్వాములు కావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రదీప్ తన ఖాతాను అద్దెకు ఇచ్చి కేవలం రూ. 25 వేలు పొందాడు, కానీ ఇప్పుడు వందల కోట్ల స్కామ్‌లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఇక ఈ స్కామ్ వెనుక ఉన్న అసలైన వాళ్ళను పట్టుకోవడానికి గుజరాత్ పోలీసులు మరియు ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.