2002లో రూ. 48 ఉన్న రూపీ విలువ.. ఇప్పుడు రూ.92కు రావడం వెనుక కారణం ఇదే !
2002లో ఒక డాలర్ కు రూ. 48 ఉన్న రూపీ విలువ 2026లో రూ. 92గా ఉంది. కాలం గడిచే కొద్దీ రూపాయి బలహీనపడుతోంది.;
2002లో ఒక డాలర్ కు రూ. 48 ఉన్న రూపీ విలువ 2026లో రూ. 92గా ఉంది. కాలం గడిచే కొద్దీ రూపాయి బలహీనపడుతోంది. దీనికి ప్రభుత్వాలు కారణమా ?. లేదా వేరే కారణాలు ఉన్నాయా ?. వేరే కారణాలు ఉంటే అవి ఏంటి ?. అసలు డాలర్ తో పోల్చినప్పుడు రూపీ విలువ ఎందుకు తగ్గుతోంది ?.
డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా డాలర్ తోనే ఎందుకు రూపీ విలువను పోల్చుకోవాలి?. వేరే దేశాల కరెన్సీతో పోల్చుకోవచ్చు కదా ?. డాలర్ కు ఉన్న ప్రత్యేకత ఏంటి ?. డాలర్ బలం ఏంటి అన్నది కీలక ప్రశ్నలు. దీనికి కొంత చరిత్రను అర్థం చేసుకోవాలి. గతంలో ఇప్పుడు మనం చూస్తున్న డబ్బు చెలామణిలో లేదు. బంగారం, వెండి చెలామణిలో ఉన్నాయి. వాటిని ఉపయోగించి వ్యాపారాలు సాగేవి. బంగారం, వెండిని ప్రతిచోటుకి తీసుకెళ్లడం రానురాను ఇబ్బందికరంగా మారింది. భద్రతాపరంగాను, సౌకర్యంపరంగానూ ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, దాని విలువకు సమానంగా బ్యాంకులు బ్యాంక్ నోట్స్ జారీ చేశాయి. క్రమంగా ఆ బ్యాంక్ నోట్స్ డాలర్ గా రూపాంతరం చెందాయి. డాలర్ విలువ వెనకు బంగారం ఉంటుంది. ఉదాహరణకు ఒక తులం బంగారం విలువ వెయ్యి రూపాయలు అనుకుంటే.. ఒక డాలర్ విలువ వెయ్యి ఉంటుంది. చాలా దేశాలు అమెరికాలో తమ బంగారాన్ని నిల్వ చేసుకున్నాయి. అమెరికా తనకు అవసరమైనప్పుడల్లా ఎక్కువ డాలర్లను ప్రింట్ చేసింది. బంగారాన్ని ప్రింట్ చేయలేదు కాబట్టి.
నిక్సన్ షాక్
ఎక్కువ డాలర్లు ప్రింట్ చేసేకొద్దీ బంగారం విలువ తగ్గుదు కానీ.. ప్రజల నమ్మకం తగ్గుతుంది. దీనిని గమనించి చాలా మంది తమ బంగారం డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో అమెరికా వద్ద ఉన్న బంగారం నిల్వలు తగ్గాయి. మిగిలిన దేశాలకు కూడా విషయం అర్థమైంది. ఆ దేశాలు కూడా బంగారాన్ని వెనక్కి తీసుకున్నాయి. దీంతో అమెరికా బంగారం నిల్వలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ 1971లో డాలర్ తో గోల్డు మార్చుకోవడాన్ని తొలగించారు. ఇప్పుడు డాలర్ వెనుక గోల్డ్ లేదు. డాలర్ అన్నది కేవలం పేపర్. తర్వాత 1974లో అమెరికా సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం మేరకు పెట్రోల్, డీజిల్, ముడిచమురును డాలర్లలోనే ప్రపంచ దేశాలకు అమ్మాలి. దానికి ప్రతిఫలంగా అమెరికా సౌదీ అరేబియాకు సైనిక, ఆర్థిక మద్దతు ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు డాలర్ తో దిగుమతులు చేసుకుంటున్నాయి. సౌదీ అరేబియాతో అమెరికా ఒప్పందం ప్రపంచ రాజకీయాల్ని మార్చాయి. డాలర్ ఆధిపత్యం మొదలైంది. అప్పటి నుంచి డాలర్ అవసరం అన్ని దేశాలకు ఏర్పడింది.
డాలర్ బలం.. రూపాయి బలహీనం
రూపాయి విలువ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన దేశ పారిశ్రామిక అవసరాలు పెరిగేకొద్ది చమురు దిగుమతులు పెరిగాయి. చమురును డాలర్లతోనే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతి కాలంలో బంగారం, ఎలక్ట్రానిక్స్ దిగుమతులు డాలర్లతోనే జరిగాయి. మన దేశ ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగితే డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు రూపాయి డిమాండ్ తగ్గి..రూపీ బలహీనపడుతుంది. ప్రధానంగా ఆయిల్ ధరలు పెరిగినప్పుడు డాలర్ కు మరింత డిమాండ్ ఉంటుంది. రూపీ వాల్యూ పడుతుంది. చరిత్రలో ఒకే సమయంలో ఆయిల్ ధరల పెరుగుదలను, రూపీ విలువ తగ్గుదలను మనం స్పష్టంగా చూడవచ్చు.
వడ్డీ రేట్లు
అమెరికా వడ్డీ రేట్లు పెంచినప్పుడు పెట్టుబడులు అమెరికాకు వెళ్తాయి. ఇండియాలో ఉన్న విదేశీ పెట్టుబడులు అమెరికాకు వెళ్తే డాలర్ డిమాండ్ పెరిగి రూపీ విలువ తగ్గుతుంది. రూపీ విలువ తగ్గడానికి ఇది మరొక కారణం. ద్రవ్యోల్బణం కూడా రూపీ విలువ తగ్గడానికి దీర్ఘకాలంలో దోహదం చేస్తుంది. చమురు ధరలు పెరిగితే ఇండియాలో వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీర్ఘాకాలంలో ఇది రూపీ విలువ పడిపోవడానికి కారణం అవుతుంది. అదే విధంగా మన దేశం విదేశాల నుంచి డాలర్లలో అప్పు తీసుకుంటే వడ్డీతో సహా డాలర్లలో చెల్లించాలి. అప్పడు మళ్లీ డాలర్లు కావాలి. అప్పుడు కూడా రూపీ విలువ తగ్గుతుంది.
కారణం ఇవే !
ఎగుమతులు, దిగుమతుల మధ్య ఉన్న లోటు, అంతర్జాతీయ సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, డాలర్ బలపడటం రూపీ విలువ తగ్గడానికి కారణమైంది. అందుకే ఇండియా బ్రిక్స్ లో చేరింది. బ్రిక్స్ దేశాలతో కలిసి వ్యాపారాన్ని లోకల్ కరెన్సీలతో చేయాలని చూస్తోంది. బ్రిక్స్ కరెన్సీ రూపొందించాలని ప్రయత్నిస్తోంది. డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టడం ద్వారా, డాలర్ రహిత వ్యాపారం చేయడం ద్వారా రూపీ విలువ పడిపోవడాన్ని తగ్గించుకోవచ్చు.