మూసీ రేసులో 'అన్నా-చెల్లి'.. పేదల ఇళ్ల కోసం కవిత పోరాటం.. కొత్త పార్టీకి పునాదా?
మూసీ తీరంలో అక్రమ నిర్మాణాల తొలగింపును వ్యతిరేకిస్తూ కవిత తాజాగా ధర్నాకు దిగారు. ‘నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో పక్కన పెడితే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది.;
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు వస్తుందో ఊహించడం కష్టం. నిన్నటి వరకు ఒక లెక్క, నేడు మరో లెక్క. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన పేరుతో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ డ్రామాకు తెరలేపింది. ఈ రేసులో అటు అన్న (కేటీఆర్), ఇటు చెల్లి (కవిత) ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఎవరు ఎవరిని గెలిపిస్తారో, చివరకు ఎవరు గెలుస్తారో తెలీదు కానీ, కవిత మాత్రం ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.
నాడు బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్.. ఒకే తీరు!
మూసీ తీరంలో అక్రమ నిర్మాణాల తొలగింపును వ్యతిరేకిస్తూ కవిత తాజాగా ధర్నాకు దిగారు. ‘నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో పక్కన పెడితే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. కేవలం డబ్బు ఉన్నోళ్ల కోసమే పనిచేస్తూ పేదల ఇళ్లను కూల్చేస్తోంది’ అని ఘాటుగా విమర్శించారు. బాధితుల దగ్గరకు వెళ్లి, ‘ఎవరూ భయపడొద్దు.. నేనున్నా.. నే వస్తున్నా.. మీ తరపున నే పోరాడుతా’ అంటూ ఆమె ఇచ్చిన భరోసా ఇప్పుడు పాతబస్తీ, మూసీ పరివాహక ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ధర్నా కాస్తా ఉద్రిక్తంగా మారి ఆమె అరెస్ట్ వరకు వెళ్లడం విశేషం.
జాగృతి బాట.. పొలిటికల్ ఫార్మాట్!
మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ కారుకి ఒక 'స్టెపినీ'లా తెలంగాణ జాగృతి పని చేసింది. ఇప్పుడు కవిత మళ్లీ అదే పంథాను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సొంతంగా ఒక బలాన్ని నిరూపించుకోవడానికి, ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఆమె 'జాగృతి'ని మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేసే వరకు కూడా ఈ జాగృతి ఒక బలమైన వేదికగా ఉండబోతోంది.
జాగృతి ద్వారా ఊరూరా తిరగడం, ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడం, ఇప్పుడు ఈ అరెస్టులు.. ఇవన్నీ చూస్తుంటే ఒక 'పెర్ఫెక్ట్ పొలిటికల్ ఫార్మాట్' కనిపిస్తోంది. అంటే, భవిష్యత్తులో ఆమె ఒక సొంత రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అన్నా-చెల్లెళ్ల మధ్య పోటీ?
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ఇప్పటికే బలమైన ముద్ర వేశారు. ఇప్పుడు కవిత కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్లి ఇలాంటి పోరాటాలు చేయడం వల్ల, పార్టీలో ఎవరు ఎక్కువ మైలేజ్ సాధిస్తారు? అనే చర్చ మొదలైంది. ఒకరకంగా ఇది ఆరోగ్యకరమైన పోటీ అని కొందరు అంటున్నా, ఇది భవిష్యత్తులో కొత్త పార్టీ ఏర్పాటుకు దారితీస్తుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ‘నే వస్తున్నా’ అంటూ ఆమె పదే పదే చెప్పడం వెనుక ఒక బలమైన రాజకీయ సంకేతం దాగి ఉంది.
రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది చాలా కీలకమైన ఆయుధం. పేదల ఇళ్లు కూల్చేస్తున్నారనే అంశాన్ని కవిత సరిగ్గా పట్టుకున్నారు. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఒక పక్క ప్రభుత్వం మూసీని క్లీన్ చేస్తామని అంటుంటే, మరోపక్క విపక్షాలు పేదల పక్షాన నిలబడతామని అంటున్నాయి. ఈ గొడవలో చివరకు లబ్ధి పొందేది ఎవరో కానీ, కవిత మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్పీడుగా మొదలుపెట్టేశారు. ఆరెస్టులు, ధర్నాలు, కొత్త పార్టీ ఊహాగానాలు.. ఇవన్నీ కలిపి చూస్తే తెలంగాణ రాజకీయం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కడం ఖాయం!