'అంతా బాగుంది' : సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఇచ్చుకుంటున్న వైసీపీ ప్ర‌భుత్వం

Update: 2022-01-03 13:30 GMT
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాటై రెండున్నర సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. ఈ రెండున్న‌రేళ్ల‌లో ఒక్క ఇటుక పేర్చింది లేదు. ఒక్క త‌ట్ట మ‌ట్టి ఎత్తి పోసింది లేదు. ఒక్కంటే ఒక్క‌టైనా ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ను తీసుకువ‌చ్చింది లేదు. ల‌క్ష‌ల్లో కాదు.. వేల‌ల్లో అయినా.. ప్ర‌భుత్వ కొలువులు ఇచ్చింది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నాశ‌న‌మైన ర‌హ‌దారుల‌ను బాగు చేసింది అంత‌క‌న్నా లేదు. ఇక‌, నిరుద్యోగం, అభివృద్ధి లేమి వంటివి ఈ రెండున్న‌రేళ్ల‌లో రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ నిరుద్యోగులు రోడ్డెక్కిన ప‌రిస్థితి ఉంది. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం ``అంతా బాగుంది. అంతా బాగానే చేశాం!`` అని సెల్ఫ్ స‌ర్టిఫికెట్లు ఇచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ఈ రెండున్న‌రేళ్ల కాలంలో వైసీపీ ప్ర‌భుత్వం చేసింది ఏమైనా ఉంటే.. న‌వ‌ర‌త్నాలు పేరుతో పంప‌కాలే చేసింది. పేద‌ల‌కు డ‌బ్బులు ఇస్తే.. త‌ప్పా.. అంటూ.. విప‌క్షాల‌పై ఎదురు దాడి చేస్తూ.. మ‌రీ పంపకాల ప్రోగ్రామ్ ను నిరంత‌రాయంగా కొన‌సాగింది. అయితే.. ఈ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి? రాష్ట్రంలో ఉత్పాద‌క శ‌క్తి పెరిగి.. త‌ద్వారా.. ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూరి.. ఇలా పంప‌కాలు చేస్తున్నారా? అంటే.. అదేం లేదు. లెక్క‌లు మీరిన అప్పులు చేస్తూ.. ప్ర‌తి నెలా ఢిల్లీ చుట్టూ.. గిర‌గిరా తిరుగుతూ.. చేసుకున్న అప్పులు. ఈ అప్పుల నుంచి వ‌చ్చిన సొమ్ముతోనే.. పంచుతున్నారు.

అయితే.. ఇది రాష్ట్రానికి భ‌విష్య‌త్తు లేకుండా చేస్తుంద‌ని.. వ‌చ్చే సంవ‌త్స‌రాల్లో ఆర్థి క ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతుంద‌ని ఎంత‌మంది హెచ్చ‌రించినా.. ప్ర‌భుత్వం పెద్ద‌లు పెడ‌చెవిన పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వం, మ‌రోవైపు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు కూడా ఏపీ చేస్తున్న దుబారాపై అనేక మార్లు హెచ్చ‌రించాయి. అప్పులు చేస్తున్నారు.. ఎలా తీరుస్తారంటూ.. కొన్నాళ్ల కింద‌ట కాగ్ రిపోర్టు కూడా నిల‌దీసింది. అయినా.. కూడా అంతా బాగుంద‌నే.. ఫీలింగ్‌లోనే ఏపీ స‌ర్కారు ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి ఉద్యోగుల‌కు నెల‌నెలా జీతాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఆప‌శోపాలు ప‌డుతున్న మాట వాస్త‌వం. `ఏదో ఒక రోజు జీతాలు ఇస్తున్నాం క‌దా!` అంటూ.. మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి.. ఆర్థిక ప‌రిస్థితి ఖ‌జానా ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధ మ‌వుతుంది. పోనీ.. అప్పులు చేస్తున్నా.. ఆదాయం వ‌చ్చే రంగాల‌పై పెట్టుబ‌డులు పెడుతున్నారా? అంటే అదీ లేదు. నాడు నేడు పేరుతో పాఠ‌శాల‌ల‌కు రంగులు వేస్తున్నారు. బస్సుల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగులు అద్దుతున్నారే.. త‌ప్ప‌.. ఎక్క‌డా అడుగు మేర‌కు అభివృద్ధి క‌నిపించ‌డం లేదన్న‌ది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

అభివృద్ది లేదు. ఆదాయం లేదు. ఈ రెండున్న‌రేళ్ల కాలంలో వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు.. వెనుదిరిగి చూసు కుంటే.. క‌నిపించేది అప్పుల కుప్ప‌లు త‌ప్ప మ‌రేమీ లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలా అప్పులు తెచ్చి పంచుతూ.. ఉంటే.. ఎలా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల ఆస్తుల‌ను కూడా అమ్ముతున్నారు. ఏకంగా.. మిష‌న్ బిల్డ‌ప్ ఏపీ పేరిట భారీ ఎత్తున అమ్మ‌కాల‌కు కూడా సిద్ధ‌మ‌య్యా రు. ఇలా ఎన్నాళ్లు చేస్తారు. అంటే.. వెంట‌నే ప‌న్నులు పెంచుతున్నారు. ప్ర‌జ‌ల‌పై భారాలు మోపుతున్నారు. అంత‌కు మించి.. అభివృద్ధి దిశ‌గా అడుగులు మాత్రంవేయ‌డం లేదు.

మీరు ప్ర‌జ‌ల‌కు ఏం మేలు చేశారు? అంటే.. మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించాం.. సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించాం.. అని చెబుతుంటే.. ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఉద్యోగులు పీఆర్‌సీ పెంచ‌మ‌ని అంటే.. ఖ‌జానా స‌హ‌క‌రించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, ఇత‌ర ప‌థ‌కాల‌ను కూడా అట‌కెక్కించారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితి కొన‌సాగుతున్న ద‌రిమిలా.. అంతా బాగానే ఉంది! అని ఎలా సెల్ఫ్ స‌ర్టిఫికెట్ ఇచ్చుకుంటారు? అనేది మేధావుల ప్ర‌శ్న‌. మ‌రి దీనిపై వైసీపీ నేత‌లు ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News