చైనీయులకు వెల్ కం.. ఐదేళ్ల తర్వాత కేంద్రం బిగ్ డెసిషన్

ఇక రెండోది కోవిడ్-19 మహహ్మారి. ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ వైరస్ కారణంగా చైనాతో మన సరిహద్దులు మూసివేశారు.;

Update: 2026-04-23 15:30 GMT

భారత, చైనా దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా నిలిచిపోయిన సంబంధాలను మళ్లీ పునరుద్ధరిస్తూ చైనా దేశాస్తులకు వీసాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ సత్సంబంధాలు నెలకొంటున్నాయనే ప్రచారానికి ఊతమిచ్చినట్లైందని అంటున్నారు. ఈ పరిణామంతో భారతీయులు ఎక్కువగా ఇష్టపడే కైలాస మానససరోవర్ యాత్ర కూడా తిరిగి ప్రారంభించే అవకాశాలు ఏర్పడ్డాయని వ్యాఖ్యానిస్తున్నారు.

చైనా పర్యాటకులకు భారత్ వీసాలు జారీ చేయాలనే నిర్ణయం అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక కీలక పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2020 నుంచి భారత్-చైనా మధ్య పర్యాటక వీసాల జారీ ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. భద్రతా కారణాల దృష్ట్యా చైనా పౌరులపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది.

ఇక రెండోది కోవిడ్-19 మహహ్మారి. ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ వైరస్ కారణంగా చైనాతో మన సరిహద్దులు మూసివేశారు. కోవిడ్ వైరస్ ప్రబలడంతో అప్పట్లోనే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. వైరస్ తగ్గిన తర్వాత మిగిలిన దేశాలతో రాకపోకలను తిరిగి ప్రారంభించినా, చైనా సరిహద్దులు మాత్రం తెరచుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇరు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడేందుకు దోహదపడుతుందని అంటున్నారు.

చైనా, హంకాంగ్ పౌరులకు టూరిస్టు వీసాల జారీ చేయాలనే నిర్ణయంతో పొరుగు దేశంతో ఉన్న సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని దౌత్యవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఏడాది నుంచి చైనాతో దౌత్య సంబంధాలు తిరిగి పునరుద్ధరించేలా కేంద్రం అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇరుదేశాల ఒప్పందంతో నేరుగా విమానాల రాకపోకలను పునరుద్ధరించారని అంటున్నారు. ఈ క్రమంలో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వీసాల పునరుద్ధరణ ఒక విశ్వాస పెంపు చర్యగా పనిచేస్తుందని అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పెట్రోలింగ్ హక్కులపై కుదిరిన ఏకాభిప్రాయం ఈ నిర్ణయానికి మార్గం సుగమం చేసిందని అంటున్నారు.

Tags:    

Similar News