బలి దానాల దిశగా ఆర్టీసీ సమ్మె.. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ డ్రైవర్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రమవుతోంది. డిమాండ్ల సాధన కోసం బుధవారం నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు.;

Update: 2026-04-23 13:32 GMT

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రమవుతోంది. డిమాండ్ల సాధన కోసం బుధవారం నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఇక ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ ఆత్మాహుతికి ప్రయత్నించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అంగీకరించడం లేదని ఆవేదన చెందుతూ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.

ప్రభుత్వం తమ సమ్మెను పట్టించుకోలేదన్న ఆవేదనతో డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానానికి సిద్ధపడటం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకుని ఆకస్మాత్తుగా నిప్పంటించుకున్న శంకర్ గౌడ్ శరీరం 90 శాతం మేర కాలిపోయిందని చెబుతున్నారు. డ్రైవర్ ను తోటి కార్మికులు వెనువెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో సమ్మె మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాగా, డ్రైవర్ శంకర్ గౌడ్ చర్యతో కార్మికులు సమ్మె బాట నుంచి బలిదానాల దిశగా సాగుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

డ్రైవర్‌ శంకర్ గౌడ్ ఆత్మబలిదానానికి సిద్ధమయ్యాడనే సమాచారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులకు క్షణాల్లో తెలిసిపోయింది. దీంతో సమ్మె సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కార్మికుల ఆగ్రహజ్వాలలతో డిపోలు అట్టుడుకుతున్నాయి. 32 డిమాండ్లతో బుధవారం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఇందులో 29 పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్ననే ప్రకటించారు. మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుందన్న ఆయన ప్రకటనతో కార్మికులు సంతృప్తి చెందలేదు.

దీంతో రెండు రోజులుగా సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధులను బహిష్కరించడంతో ఎక్కడిబస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులు కేవలం ఐదు శాతం బస్సు సర్వీసులు మాత్రమే నడపగలుగుతున్నారు. ఇలా డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులను అడ్డుకునేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండగా, పోలీసులు రక్షణగా నిలుస్తూ కార్మికులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే నర్సంపేటలో డ్రైవర్ ఆత్మాహుతికి సిద్ధమవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అయినా ప్రభుత్వం పట్టువీడి కార్మికుల డిమాండ్లను నెరవేర్చేలా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో సమ్మె మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News