గోదావరి పారినంత కాలం.. కేసీఆర్ సుస్థిరం: కేటీఆర్
''తెలంగాణలో కేసీఆర్‌ను.. ఆయన రాజకీయాలను లేకుండా చేయాలని కొన్ని దుష్టశక్తులు పన్నాగాలు పన్నుతున్నాయి. కానీ.. అది వారికి సాధ్యం కాదు.;
''తెలంగాణలో కేసీఆర్‌ను.. ఆయన రాజకీయాలను లేకుండా చేయాలని కొన్ని దుష్టశక్తులు పన్నాగాలు పన్నుతున్నాయి. కానీ.. అది వారికి సాధ్యం కాదు. తెలంగాణలో గోదావరి పారినంత కాలం.. కేసీఆర్ రాజకీయాలు సుస్థిరం. ఆయన చరిత్ర సుస్థిరం'' అని కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ పేరును ఎవరూ తీసేయలేరని అన్నారు.
తెలంగాణ హైకోర్టు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పక్కన పెడుతూ.. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ కాదని.. అది కాంగ్రెస్ కమిషన్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి బీఆర్ ఎస్‌ను కావాలనే ఇరికించే ప్రయత్నం చేసిందన్నారు. కానీ, న్యాయం, ధర్మం ఉన్నాయని.. కోర్టుల్లో వీగిపోయిందని వ్యాఖ్యానించారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారికి బుద్ది వచ్చేలా చేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు, రైతులు, కాళేశ్వరం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరూ హైకోర్టు తీర్పుతో గెలిచారని అన్నారు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ పాలకులకు జ్ఞానోదయం కలిగిందని అన్నారు. అన్నీ ఆలోచించి.. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని కేటీఆర్ చెప్పారు. దీనికి 94 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయిందని.. కానీ, లక్షల కోట్లు ఖర్చు చేశామని దుష్ప్రచారం చేశారని విమర్శించారు.
మేడిగడ్డపై మళ్లీ విచారణ..
మేడిగడ్డను కూల్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ విమర్శించారు. డిటోనేటర్లను పెట్టి పేల్చుతున్నారని.. ఆ నిందలు కేసీఆర్‌పైనా బీఆర్ ఎస్‌పైనా వేస్తున్నారని అన్నారు. మేడిగడ్డపై మరోసారి విచార ణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తితో ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆయన పట్టుబట్టారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని ఈ ప్రభుత్వం ఎప్పటికీ తుడిచి పెట్టలేదని వ్యాఖ్యానించారు.