మెమన్ ను ఉరి తీసేది అతనేనా..?

Update: 2015-07-26 05:09 GMT
ముంబయిలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో 250 మంది అమాయకుల మరణానికి కారణమైన యాకూబ్ మెమన్ ను ఉరి తీసేందుకు ఏర్పాటు వేగంగా జరిగిపోతున్నాయి. ఈ నెల 30న మెమన్ కు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఉరిశిక్ష అమలు చేయటానికి.. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు.. తన ఉరిని ఆపాలంటూ పెట్టుకున్న దరఖాస్తుపై తుది నిర్ణయం ఈ నెల 27న అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పనుంది.

ఇక.. మెమన్ ను ఎక్కడ ఉరి తీస్తారన్నది సందేహంగా మారింది. ఎందుకంటే.. మెమన్ ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో ఉన్నారు. మహారాష్ట్రలో ఉరి తీసేందుకు సౌకర్యం ఉన్న జైళ్లు రెండు ఉన్నాయి. అందులో ఒకటి పూణె లోని ఎరవాడ జైలు కాగా.. రెండోది నాగపూర్ జైలు. ప్రస్తుతం నాగపూర్ జైల్లో ఉన్న మెమన్ ను అదే జైల్లోఉరి తీయాలని అధికారులు నిర్ణయించారు. ఉరిశిక్ష అమలుకు అవసరమైన తాడును నాగపూర్ జైల్లోనే తయారు చేయాలని నిర్ణయించారు.

ఇక.. ఉరిశిక్ష అమలు చేయటానికి అవసరమైన తలారిని సైతం అధికారులు ఎంపిక చేశారు. ముంబయిలోకి అక్రమంగా చొచ్చుకొచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లేలా చేసిన కరుడుగట్టిన తీవ్రవాది కసబ్ ను ఉరి తీసిన తలారినే.. మెమన్ ఉరిశిక్ష అమలు చేయటానికి వినియోగించాలని అధికారులు నిర్ణయించినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News