ప్రధాని, రాష్ట్రపతి స్పందించకపోతే ఆ పనిచేస్తాం: మహిళా రెజ్లర్లు హెచ్చరిక!

Update: 2023-05-30 16:50 GMT
తమను లైంగికంగా వేధించిన భారత రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ ను అరెస్టు చేయాలని మహిళా రెజ్లర్లు తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ నిరసనలను తీవ్ర స్థాయికి చేర్చిన రెజ్లర్లు మే 28న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడి వరకు శాంతియుత నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని ఈడ్చి పారేశారు.

వారిని పోలీస్‌ వ్యాన్లలో ఢిల్లీలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పైగా మహిళా రెజ్లర్లు వ్యాన్‌ లో నవ్వుకుంటూ వెళ్తున్నట్టు బీజేపీ సోషల్‌ మీడియా వింగ్‌ ఫొటోలను మార్పింగ్‌ చేసింది. వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసింది. దీనిపై మహిళా రెజ్లర్లు మండిపడుతున్నారు.

అంతేకాకుండా మహిళా రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఇకపై ఆందోళనలకు అనుమతించవద్దని పోలీసులు నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. రెజ్లర్లు మే 30న  కీలక ప్రకటన చేశారు. తాము సాధించిన పతకాలకు ఎటువంటి అర్థం లేకుండా పోయిందని.. వాటిని మే 30 సాయంత్రం హరిద్వార్‌లోని ‘గంగా నది’లో కలిపేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు.

మే 28న జరిగిన పరిణామాలను అందరూ చూశారని మహిళా రెజ్లర్లు గుర్తు చేశారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. పైగా తమపైనే కేసు బనాయించారని మండిపడ్డారు.

మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం తప్పా? దేశం తరఫున తాము పతకాలు ఎందుకు సాధించామా? అని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ పతకాలకు ఎటువంటి అర్థం లేకుండా పోయిందన్నారు.

ఆ పతకాలను తిరిగి ఇవ్వడం మరణంతో సమానమని మహిళా రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం కష్టమని వాపోయారు. రాష్ట్రపతి, ప్రధాని తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మే 30న సాయంత్రం హరిద్వార్‌ వద్ద పవిత్ర గంగా నదిలో పతకాలను కలిపేస్తామని వెల్లడించారు. ఈ పతకాలే తమ ప్రాణం.. ఆత్మ అని పేర్కొన్నారు. అందుకే.. వాటిని గంగలో కలిపేశాక ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని అని హెచ్చరించారు.

Similar News