రాజకీయ నాయకులు జెన్ జెడ్ పై ఎందుకు ఫోకస్ చేస్తున్నారు?

తాజాగా జరిగిన కీలక సంస్థాగత సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన పవన్.. పార్టీని బేస్ లెవల్ నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.;

Update: 2025-12-22 18:30 GMT

జెన్ జెడ్.. ఇప్పుడు వీళ్లదే రాజ్యం.. బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని కూల్చేశారు. షేక్ హసీనాను దేశం వదిలి పోయేలా చేశారు. ఇక నేపాల్ లో జెన్ జెడ్ యువత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. విధ్వంసం సృష్టించారు. ఏకంగా ప్రధానిని పారిపోయేలా చేశారు. పాకిస్తాన్ లోనూ జెన్ జెడ్ నిరసనలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుల చూపు ఇప్పుడు జెన్ జెడ్ పైన పడింది. వారినే ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాల్లో తట్టి లేపుతున్నారు. తమ రాజకీయ మనుగడకు ఒక పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. రాజకీయ నాయకులు జెన్ జెడ్ పై ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? కారణమేంటన్నది తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో జెన్ జెడ్ యువత ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ రాజకీయాలను మార్చేస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో ప్రభుత్వాలను కూల్చిన జెన్ జెడ్ నిరసనల తర్వాత ఇవన్నీ యువత శక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ పరిణామాలతో రాజకీయ నాయకుల చూపంతా ఇప్పుడు జెన్ జెడ్ పైనే పడింది.

ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం జెన్ జెడ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తాజాగా జరిగిన కీలక సంస్థాగత సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన పవన్.. పార్టీని బేస్ లెవల్ నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను.. జెన్ జెడ్ ను.. జనసేన వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. శక్తివంతమైన రాజకీయ కుటుంబాల చుట్టూ ఒక్క రాత్రిలో ఎదిగిన పార్టీల మాదిరిగానే జనసేనను నిర్మించలేమని పవన్ కళ్యాణ్ చెప్పారు. క్రమశిక్షణ, నిర్మాణం, కఠిన శ్రమతోనే పార్టీ ఎదగాలని షార్ట్ కట్స్ లేదా వారసత్వా రాజకీయాలపై ఆధారపడబోమని తేల్చిచెప్పారు. పార్టీ తన సొంత బలంపై నిలబడాలని ఆయన పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మార్చి 14న జరుగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి జెన్ జెడ్ థీమ్ తో నిర్వహించనున్నట్లు పవన్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ప్రేరణ ఇచ్చేలా, వచ్చేతరం ముందు పార్టీ విజన్ ను స్పష్టంగా ఉంచేలా కార్యక్రమాలు రూపొందించనున్నట్టు తెలిపారు.

ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుడుతున్న జెన్ జెడ్ వైపు పవన్ మాత్రమే కాదు అగ్ర రాజకీయ నాయకుల చూపు మళ్లింది. వీరు వాడే టెక్నాలజీ , సోషల్ మీడియా వ్యూహాలను అర్థం చేసుకోవడం పాతతరం నేతలకు సవాల్ గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఈ యువతే నిర్ణయాత్మక శక్తి అని నాయకులు గుర్తించారు. కేవలం హామీలతో సరిపెట్టకుండా.. యువతకు ఉద్యోగాలు, పారదర్శకత చూపించకపోతే తమ పరిస్థితి కూడా హసీనా, ఓలీల లాగానే మారుతుందని భయపడుతున్నారు.

జెన్ జెడ్ కేవలం ట్రెండ్ లను ఫాలో అవ్వడమే కాదు. ట్రెండ్ లను సెట్ చేస్తోంది. రాజకీయాల్లోనూ కొత్త మార్పులను కోరుతోంది. బంధుప్రీతిని, అవినీతిని సహించబోమంటూ వీరు ఇస్తున్న నినాదాలు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయా? లేదా అస్థిరతకు దారితీస్తాయా? అనేది వేచిచూడాలి.

Tags:    

Similar News