అంబటికి సొంత నేతల పొగ.. సత్తెనపల్లిలో పొలిటికల్ సెగ!
దీంతో గత కొన్నాళ్లుగా అంబటి కేంద్రంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. సత్తెనపల్లి వైసీపీ నియోజక వర్గం ఇన్‌చార్జిగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని జగన్ నియమించారు.;
వైసీపీ నాయకుడు, తరచుగా మీడియా ముందుకు వచ్చి.. కూటమి పాలకులపై విమర్శలు గుప్పించే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు.. సొంత పార్టీలోనే పొగ పెడుతున్నారా? పొలిటికల్‌గా సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలోనే ఆయనకు పొలిటికల్ సెగ తగులుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి.. సత్తెనపల్లిలో అంబటి ఓడిపోయినా.. ఆయన పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నా రు. కానీ,ఇక్కడ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలను అధినేత జగన్ వేరేవారికి ఇచ్చారు.
దీంతో గత కొన్నాళ్లుగా అంబటి కేంద్రంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. సత్తెనపల్లి వైసీపీ నియోజక వర్గం ఇన్‌చార్జిగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని జగన్ నియమించారు. ఈయన సజ్జల రామకృష్నారెడ్డి అనుచరుడిగా పేరుంది. ఆది నుంచి అంబటికి-సజ్జలకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో భార్గవ్ రెడ్డి ఇక్కడ దూకుడు పెంచారు. అంబటి రాంబాబు వర్గాన్ని భార్గవ్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టారు. పార్టీలో ఏ కార్యక్రమం నిర్వహించినా.. అంబటి వర్గానికి ఎలాంటి సమాచారం అందడం లేదు.
పోనీ.. అంబటి వర్గం చేపట్టిన కార్యక్రమానికి భార్గవ్‌ను పిలుస్తున్నారా? అంటే అది కూడా లేదు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు వర్గపోరుకు పరాకాష్ఠగా మారాయి. చివరకు ఇది కీలక నేతల రాజీనామాల వరకు చేరింది. వాస్తవానికి 2019 ఎన్నికల నుంచి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో చక్రం తిప్పుతున్నారు. అప్పట్లో ఆయన విజయం దక్కించుకున్నాక.. నియోజకవర్గంపై ఆధిపత్యం చేశారు. అయితే.. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. వైసీపీ నుంచి నాయకుల జంపింగులు ప్రారంభమయ్యాయి.
తాజాగా అంబటిని రేపల్లె నియోజకవర్గం బాధ్యతలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం కోరుతోంది. అయితే.. ఆయన మాత్రం సత్తెనపల్లిని వదిలి పెట్టడం లేదు. మరోవైపుఈ పరిణామాల నేపథ్యంలోనే భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కాపు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి బలమైన నియోజకమే అయినా.. అంబటి మాత్రం తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సత్తెనపల్లిలో ఆయనకు చెక్ పెడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా అంబటి వర్గం రాజీనామాలు చేసి.. గుట్టు చప్పుడు కాకుండా.. టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.