మరో చారిత్రాత్మక కార్యక్రమానికి పవన్ శ్రీకారం
ఇక పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మరో చారిత్రాత్మక కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుడుతున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది.;
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద మక్కువతో రంగ ప్రవేశం చేశారు. పదేళ్ళ పోరాటం తరువాత ఆయనకు అధికార హోదా దక్కింది. దాంతో తనకు ఎంతో ఇష్టమైన మంత్రిత్వ శాఖలనే ఆయన తీసుకున్నారు. పవన్ చేతిలో ఉన్న ప్రతీ శాఖలో తనదైన శైలిలో ప్రత్యేకతను చూపిస్తున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇపుడు ఈ మంత్రిత్వ శాఖలలో పవన్ మార్క్ ఆయన బ్రాండ్ స్పష్టంగా ఉండేలా పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు. దాంతో ఈ శాఖల ద్వారా ఇంత పని చేయవచ్చా ఇంతటి కీలకమైన శాఖలా ఇవీ అన్న చర్చ కూడా మొదలైంది.
మార్క్ ఉండేలా :
పవన్ చేతిలో అటవీ శాఖ పర్యావరణం, గ్రామీణ నీటి పారుదల శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖతో పాటు పంచాయతీ రాజ్ శాఖ ఉంది. ఈ శాఖలో నిజంగా చూస్తే ఎంతో వర్క్ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే పల్లెలకు సంబంధించిన శాఖలుగా ఉంటాయి. దాంతో ఈ శాఖల మీద పట్టు సంపాదిస్తే గ్రామీణ ఆంధ్రాను పూర్తిగా మార్చేయవచ్చు. కేంద్రం నుంచి కూడా ఈ శాఖలకు నిధులు విడుదల అవుతాయి. దాంతో పవన్ ఫోకస్ పెట్టి మరీ ఒక్కో మంత్రిత్వ శాఖలో మార్క్ చూపిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో అయితే ఆయన తన విలక్షణతను చాటుకుంటూ పరుగులు పెట్టిస్తున్నారు.
పెసా మహోత్సవ్ :
ఇక పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మరో చారిత్రాత్మక కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుడుతున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రతీ ఏటా పెసా మహోత్సవ్ ని నిర్వహిస్తున్నారు. ఇది పీసా చట్టం అమలు చేసిన తరువాత 1996 నుంచి దేశంలో నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. అలాంటి జాతీయ కార్యక్రమాన్ని పవన్ ఏపీకి తీసుకుని వచ్చారు. అందులోనూ గిరిజనుల ఎక్కువగా ఉండే విశాఖ జిల్లాను ఆయన ఎన్నుకోవడం విశేషం. ఇక ఈ నెల 24న జరిగే పెసా మహోత్సవ్ ని పవన్ స్వయంగా ప్రారంభిస్తున్నారు. అంతే కాదు ఆయనే ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పెసా చట్టం అంటే :
పెసా చట్టం గురించి చాలా మందికి తెలియదు, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఆమోదించింది. దీని ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజనులకు వారి స్వయం పరిపాలక కోసం అధికారాలు హక్కులు ఈ చట్టం ప్రకారం లభిస్తాయి. అంతే కాదు వారు ఉన్న భూమి కానీ వారి కల్చర్ కానీ వారి సంప్రదాయాలు కానీ అలాగే వారు నమ్ముకున్న సహజ వనరులు కానీ ఏవీ విధ్వంసం కాకుండా అన్యుల పరం అవనీయకుండా పెసా చట్టం కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంది. ఈ చట్టాన్ని డిసెంబర్ 24న 1996లో ఆమోదించారు. అందువల్ల ప్రతీ ఏటా ఈ రోజున పెసా మహోత్సవాల పేరుతో నిర్వహిస్తూ గిరిజనులకి అవగాహన కల్పిస్తూంటారు.
భారీ కార్యక్రమం :
ఇక విశాఖలో నిర్వహించే పెసా మహోత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న 10 కి పైగా రాష్ట్రాల నుంచి గిరిజన ప్రతినిధులు హాజరవౌతారు అలాగే గిరిజన వర్గానికి చెందిన వారు కళాకారులు క్రీడాకారులు అంతా కలిసి దాదాపుగా రెండు వేల మందికి పైగా హాజరవుతారు. అలాగే కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు
ఏపీకి విశాఖకి :
జాతీయ స్థాయి పెసా మహోత్సవాలను విశాఖలో నిర్వహించడం వల్ల ఏపీకి విశాఖ సహా ఉత్తరాంధ్ర కు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ రోజుకీ మారుమూల గిరిజన ప్రాంతలకు సరైన రహదారి కానీ విద్యుత్ సదుపాయం కానీ లేదు, దాంతో వాటికి మరింత ఊతమిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు వీలు అవుతుంది, అంతే కాదు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. మొత్తానికి పవన్ చొరవతో మరో చారిత్రాత్మక కార్యక్రమానికి విశాఖ వేదిక అవుతోంది.