అమరావతిపై రెఫరెండం పెడతారా ?

Update: 2020-10-14 06:00 GMT
ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందన్నట్లుగా ఉంది ప్రతిపక్షాల వాదన. మొన్నటి ఎన్నికల్లో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తు అమరావతినే రాజధానిగా ఉండాలని చంద్రబాబునాయుడు+సీపీఐ+జనసేన+కాంగ్రెస్ పట్టుబడుతున్న విషయమూ తెలిసిందే. ఇదే విషయమై ఓ టివీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ రాజీనామాలు చేయాలని, అవసరం లేదనే విషయమై పెద్ద ఎత్తున వాద ప్రతివాదనలు జరిగాయి.

అయితే ఇదే సమయంలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి అంశంపై రాష్ట్రవ్యాప్తంగా రెఫరెండం పెట్టాలంటూ డిమాండ్ చేశారు. రెఫరెండంలో అమరావతికి ఒక్క ఓటు వ్యతిరేకంగా వచ్చినా తాను అమరావతి ఉద్యమాన్ని వదిలేస్తానని చెప్పారు. అంటే ఇపుడు సీపీఐ చేస్తున్న ఉద్యమం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదులేండి. అమరావతి కోసం జోలెపట్టుకుని చంద్రబాబు తిరిగినపుడు రామకృష్ణ కూడా తిరిగారంతే. ఈ మాత్రానికే తాను ఉద్యమం నుండి తప్పుకుంటానని చెప్పటమే విచిత్రంగా ఉంది.

ఇక టీడీపీ మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ రాజీనామాలు చేయాలనే పాత పాటనే పదే పదే వినిపించారు. అయితే దీన్ని మంత్రి సీదిరి అప్పలరాజు తిప్పికొట్టారనుకోండి అది వేరే సంగతి. అమరావతి అంశంగా రాజీనామాలు చేయాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. అంతగా అవసరం అనుకుంటే టీడీపీ సభ్యులే రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్ళాలంటూ గట్టి సమాధానమే ఇచ్చారు. నిజానికి అమరావతి అంశంపై ఇటు ప్రతిపక్షమైనా అటు అధికారపార్టీ అయినా రాజీనామాలు చేసేదే లేదు. ఉత్తినే రాజీనామాలంటూ చాలెంజులు విసురుకుంటూ చర్చా కార్యక్రమాన్ని చూసేవాళ్ళ బుర్రలు చెడగొట్టడమే.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమరావతి అంశంపై  ఎలాగైనా వైసీపీ వాళ్ళతో రాజీనామాలు చేయించాలని టీడీపీ నేతలు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని రామకృష్ణ మాట్లాడుతూ ఎవరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజీనామాలు చేసేవాళ్ళయితే ఈపాటికే రాజీనామాలు చేసేసుండే వారే అంటూ దెప్పి పొడిచారు. అనవసరంగా రాజీనామాల గురించి కాకుండా రెఫరెండం గురించి ఆలోచించండంటూ కార్యదర్శి చెప్పటం కొసమెరుపు.
Tags:    

Similar News