పాపం పాకిస్థాన్.. మరింత సంక్షోభంలో చిక్కుకుపోతుందా..?

పాకిస్థాన్‌కు ఇది అత్యంత క్లిష్ట సమయం. అటు ఇండియా సరిహద్దు, ఇటు ఆఫ్ఘన్ సరిహద్దు ఇప్పటికే అస్థిరంగా ఉన్నాయి.;

Update: 2026-04-12 09:30 GMT

పాకిస్థాన్‌ ప్రస్తుత పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్లుగా తయారైంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు.. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవ్వడంతో అత్యంత నష్టపోయే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్థానే అని చెప్పాలి. విశ్లేషకులు హెచ్చరిస్తున్నట్లుగా పాక్ ప్రాణసంకటంలో పడటానికి గల ప్రధాన కారణాల గురించి తెలుసుకుంటే..

పాక్ కొంప మునిగినట్లేనా?

అసలే అదొక రోగ్ నేషన్.. శాంతిని కాపాడడం వారికి చాతకాని పని అమెరికా, ఇరాన్ అక్కడ శాంతి చర్చలు అన్నప్పుడే దేశం మొత్తం సందేహించింది. అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిశాయి. ఇది కేవలం ఆ రెండు దేశాల సమస్య మాత్రమే కాదు.., మధ్యలో ఉన్న పాకిస్థాన్‌కు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అడకత్తెరలో పోకచెక్కగా మారింది పాక్ పరిస్థితి. పశ్చిమ సరిహద్దులో ఇరాన్, ఉత్తర సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో.. ఈ వైఫల్యం పాక్‌ను రణక్షేత్రం వైపు నెట్టేస్తోంది. విశ్లేషకులు చెబుతున్నట్లుగా పాక్ ప్రధానంగా మూడు సవాళ్లు ఎదుర్కోబోతోందట..

అమెరికా ఎయిర్‌బేస్‌ల డిమాండ్

అమెరికా తన దాడులను తీవ్రం చేయాలనుకుంటే పాకిస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌లను వాడేందుకు అనుమతి అడిగే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. ఒకవేళ పాక్ అనుమతిస్తే.. ఇరాన్ తన క్షిపణులను నేరుగా పాకిస్థాన్ వైపు మళ్లిస్తుంది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే.. అమెరికా ఇచ్చే ఆర్థిక సాయం, ఐఎంఎఫ్ రుణాలు ఆగిపోయి పాక్ ఆర్థికంగా కుప్పకూలిపోతుంది.

సౌదీ ఒప్పందంతో ‘యుద్ధం’ తప్పదా?

సౌదీ అరేబియాతో పాకిస్థాన్‌కు బలమైన రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఒకవేళ ఇరాన్-సౌదీ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడితే, ఒప్పందం ప్రకారం పాక్ తన సైన్యాన్ని పంపాల్సి ఉంటుంది. ఇది జరిగితే ఇరాన్ లాంటి శక్తివంతమైన పొరుగు దేశాన్ని శాశ్వతంగా శత్రువుగా మార్చుకోవాల్సి వస్తుంది. పక్కనే ఉన్న ఇరాన్‌ను ఎదిరించడం పాక్ భద్రతకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

మూడు వైపులా ముప్పు!

పాకిస్థాన్‌కు ఇది అత్యంత క్లిష్ట సమయం. అటు ఇండియా సరిహద్దు, ఇటు ఆఫ్ఘన్ సరిహద్దు ఇప్పటికే అస్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ సరిహద్దు కూడా రగిలిపోతే, దేశం మొత్తం ఒక రక్షణ కవచం లేని కోటలా మారిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లు కూడా పాక్‌కు వ్యతిరేకంగా మారుతున్న తరుణంలో, ఇరాన్ కూడా తోడైతే పాక్ సైన్యం దేనిని తట్టుకోగలదు అనేది పెద్ద ప్రశ్న.

ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ‘న్యూట్రల్’ గా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, అగ్రరాజ్యాల ఒత్తిడి మధ్య అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇరాన్ వేస్తున్న 10 షరతులకు అమెరికా అంగీకరించకపోవడం, ట్రంప్ హెచ్చరికలు అన్నీ కలిసి పాకిస్థాన్‌ను ఊబిలోకి లాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, చర్చల వైఫల్యం పాక్ పతనాన్ని వేగవంతం చేసేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News