పెళ్లి చేసుకుంటా.. ఓ అందమైన అమ్మాయిని పంపండి.. తుర్కియేకు ఉగాండా ఆర్మీచీఫ్ డిమాండ్
అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో ఉగాండా సైన్యాధిపతి ముహూజీ కైనెరుగాబా మరోసారి సంచలనం సృష్టించారు.;
అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో ఉగాండా సైన్యాధిపతి ముహూజీ కైనెరుగాబా మరోసారి సంచలనం సృష్టించారు. తన విచిత్రమైన కోరికలు.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కైనెరుగాబా, ఈసారి నేరుగా తుర్కియే దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సోమాలియాలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి ప్రతిఫలంగా భారీ నగదుతో పాటు, తనకు ఒక "అందమైన భార్య" కావాలంటూ ఆయన పెట్టిన డిమాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బిలియన్ డాలర్లు.. ఒక సుందరి!
సోషల్ మీడియా వేదికగా కైనెరుగాబా చేసిన తాజా ప్రకటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్ల నుంచి రక్షణ కల్పించడంలో ఉగాండా సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని, ఇందుకు ప్రతిఫలంగా తుర్కియే ప్రభుత్వం తమకు 1 బిలియన్ డాలర్లను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేవలం డబ్బుతోనే ఆయన సంతృప్తి చెందలేదు. తుర్కియే దేశంలోనే అత్యంత అందమైన యువతిని తనకు భార్యగా ఎంపిక చేసి అప్పగించాలని కోరడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అంతేకాకుండా ఈ రెండు డిమాండ్లను 30 రోజుల్లోపు నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ తుర్కియే ఈ డిమాండ్లకు లొంగకపోతే ఉగాండాలోని తుర్కియే రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని హెచ్చరించారు. ఉగాండా గగనతలంలో తుర్కియే ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటామని స్పష్టం చేశారు.
పాత వివాదాలు.. ఆవుల ఇస్తా.. మెలోనిని ఇమ్మన్నాడు!
కైనెరుగాబా ఇలాంటి వింత డిమాండ్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. మహిళలను వస్తువులుగా చిత్రీకరిస్తూ ఆయన గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. 2022లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని పై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపాయి. ఆమెను తాను వివాహం చేసుకుంటానని, ఆమెను తనకు అప్పగిస్తే ప్రతిఫలంగా 100 అంకోలే జాతి ఆవులను ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.
ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు ఇటలీ , ఉగాండా మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆయన తండ్రి, ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని స్వయంగా రంగంలోకి దిగి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తన కుమారుడిని ఆర్మీ చీఫ్ పదవి నుంచి తాత్కాలికంగా తొలగించినప్పటికీ కైనెరుగాబా తన వైఖరిని మార్చుకోలేదని తాజా ఘటన నిరూపిస్తోంది.
అంతర్జాతీయంగా విమర్శల వెల్లువ
ఒక బాధ్యతాయుతమైన సైనిక పదవిలో ఉండి, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని కించపరిచేలా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ సంబంధాలను వ్యక్తిగత కోరికలతో ముడిపెట్టడం దౌత్య నీతికి విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు తుర్కియే ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ ఒక దేశ సైన్యాధిపతి బహిరంగంగా ఇలాంటి హెచ్చరికలు చేయడం రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ ఒప్పందాలపై ప్రభావం చూపే అవకాశముంది. అగ్రనేతల వారసుడిగా ఉగాండా తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు రావడం ఆ దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై దెబ్బతీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 30 రోజుల గడువు ముగిశాక ఉగాండా ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.