రాహుల్ అంతే.. తగ్గని వైరాగ్యం!

Update: 2019-09-13 16:18 GMT
కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇంకా వైరాగ్యం తగ్గినట్టుగా లేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల్లో పార్టీ భారీ దెబ్బ తిన్నాకా రాహుల్ తీవ్రమైన వైరాగ్యాన్ని కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. మొదట్లో అది వెనక్కు తీసుకునే రాజీనామానేమో అని అంతా అనుకున్నారు. అయితే రాహుల్ ఆ విషయంలో రాజీ పడలేదు. రాజీనామాకు కట్టుబడ్డారు. చాన్నాళ్ల పాటు  రాహుల్ ను బుజ్జగించి  చివరకు  కాంగ్రెస్ వాళ్లు ఆ రాజీనామాను ఆమోదించారు. రాహుల్ స్థానంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఎవరిని నియమించాలో అర్థం కాక చివరకు ఆ బాధ్యతలను సోనియానే తీసుకున్నారు. ఆమె తాత్కాలిక ప్రెసిడెంట్ గా కొనసాగుతూ ఉన్నారు.

ఇలాంటి క్రమంలో సోనియా గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం బాధ్యతను కూడా తీసుకున్నారు. దూకుడుగా వెళ్లాలని.. పార్టీ శ్రేణులకు ఆమె ఉద్బోదించారు. కేవలం సోషల్ మీడియాకు పరిమితం కావొద్దని సూచించారు. మోడీ పాలనలోని లొసుగులను ఆధారంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ఆమె నేతలకు చెప్పారు.

అదంతా ఓకే కానీ, సోనియాగాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశానికి రాహుల్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ ఇప్పటికీ పార్టీలో యాక్టివ్ కాకపోవడం తో ఆ పార్టీ ఈ అంశంపై వివరణ ఇచ్చుకోలేకపోతోంది. రాహుల్ ఎందుకు ఆ సమావేశానికి రాలేదని మీడియా ప్రశ్నిస్తూ ఉన్నా.. కాంగ్రెస్ దగ్గర మాత్రం సమాధానం లేదు. మొత్తానికి రాహుల్ గాంధీ ఇప్పుడప్పుడే యాక్టివ్ పాలిటిక్స్ వైపు వచ్చేలా లేడని మాత్రం స్పష్టమవుతోందని  పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
Tags:    

Similar News