కమల బలం.. కధన కుతూహలమన్న కేసీఆర్

Update: 2019-08-23 06:13 GMT
యుద్ధం జరుగుతోంది. ప్రత్యర్థి ఇతరుల బలాలను తుత్తునియలు చేస్తూ బలాన్ని పెంచుకుంటున్నారు. తమ రాజ్యంపై దండెత్తడానికి వస్తున్నాడు. అయితే సైనికులు, సేనానులు అంతా ఖంగారుగా ఉన్న గులాబీ దళపతి మాత్రం లైట్ గా, హ్యాపీగా ఉన్నారు. కమల బలం.. మన కథన కుతూహలమేనని భరోసాగా ఉన్నారు. బీజేపీ బలం పెరిగితే కేసీఆర్ హ్యాపీగా ఉండడమేంటన్న ప్రశ్న గులాబీ శ్రేణులను ఆశ్చర్యపరిచిందట.. దానికి గులాబీ బాస్ చెప్పిన సమాధానం విని షాక్ తిన్న పనైందట..

బీజేపీ సిద్ధాంతాలు వేరు.. స్ట్రాటజీ వేరు.. అదో ప్రత్యేకమైన నావ.. ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలెవ్వరూ ఎదిగిన దాఖలాలులేవట.. వారి హిందుత్వ ఎజెండాకు.. వీరి లౌకిక సిద్ధాంతాలకు- వారసత్వ సిద్ధాంతాలకు పడవు. ఇక్కడే గ్రూపిజం పెరిగిపోయి బీజేపీ నావకు చిల్లు పడుతుందట.. ఇదే స్ట్రాటజీని కేసీఆర్ నమ్మి ఇప్పుడు బీజేపీ బలం ఎంత పెరిగితే మనకు రెండు లాభాలు అని విశ్లేషిస్తున్నారట..

కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నీరుగారిపోతుంది. ఇక కాంగ్రెస్ వాదులకు బీజేపీ సిద్ధాంతాలు, ప్రోత్సాహం దక్కక గ్రూపులు పెరుగుతాయి. బీజేపీలో అందలం దక్కక ఇమడలేని నేతలు తిరిగి బయటకు వచ్చేస్తారు. దీనివల్ల బీజేపీకి డ్యామేజ్ జరుగుతుంది.

కాంగ్రెస్ లో ఉండి బీజేపీలోకి వెళ్లిన సీనియర్ నేతలు నాగా జనార్ధన్ రెడ్డి- జగ్గారెడ్డిలు బీజేపీలో చేరి ఆ పార్టీ సిద్ధాంతాల్లో ఇమడలేక బయటకు వచ్చేశారు. ఇప్పుడు వెళ్లిన మాజీ ఎంపి వివేక్ సహా నేతలందరి పరిస్థితి ఇదే అవుతుందని కేసీఆర్ మంత్రులు, కీలక నేతల వద్ద ప్రస్తావించారట.. బీజేపీలో ఇమడడం వలస నేతలకు సాధ్యం కాదని.. ఆ భావజాలం పడక అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూడా దెబ్బతింటుందని కేసీఆర్ విశ్లేషించారట..ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల వాళ్లే అక్కడ ఎదుగుతారని చెప్పుకొచ్చారట. ఇలా గులాబీ బాస్ విశ్లేషణ చూశాకే కమలం పార్టీపై గులాబీ నేతలు లైట్ తీసుకోవడం మొదలు పెట్టారట.. బీజేపీపై కేసీఆర్ నేరుగా విమర్శలు చేయకపోవడానికి కారణం ఇదేనంటున్నారు. సో బీజేపీ బలం.. కాంగ్రెస్ బలహీనతకు కారణమవుతూ గులాబీ దళాన్ని పటిష్టం చేస్తుందని కేసీఆర్ తేల్చేశారన్న మాట..


Tags:    

Similar News