ఏపీలో మాదిరి బార్లకు తలుపులు తెరవని తెలంగాణ ఎందుకు?

Update: 2020-09-22 05:30 GMT
కరోనా వేళ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో మహమ్మారి కేసుల నమోదు తగ్గుతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా భారీగా నమోదవుతున్నాయి. ఆ జాబితాలో ప్రముఖంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. రోజుకు ఏ మాత్రం తగ్గకుండా 8 వేల నుంచి 10 వేల మధ్యలో కొత్త కేసులు నమోదు కావటం తెలిసిందే. ఇలాంటివేళలోనూ.. బార్లు.. రెస్టారెంట్లను ఓపెన్ చేసేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తీసుకున్నారు.

వీలైనంత త్వరగా రోటీన్ లోకి వెళ్లిపోవాలని.. లాక్ డౌన్ నాటి మూసివేతల నుంచి వ్యాపార రంగాల్ని బయటకు పడేయాలన్న యోచనలో ఏపీ సర్కారు ఉంది. అందుకే.. కేసుల నమోదు ఎక్కువగా ఉన్నప్పటికీ.. దేని దారి దానిదే అన్నట్లుగా.. ఒక్కో వాణిజ్య రంగాన్ని ఓపెన్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. తాజాగా బార్లుకు తలుపులు బార్లా తెరిచేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఏపీలో తీసుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే షురూ అయినట్లుగా చెబుతున్నారు. కేవలం ఒక మాటతో నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. సీఎం కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఇప్పటివరకు ఆలోచనే చేయలేదని చెబుతున్నారు. బార్లను ఓపెన్ చేయటం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ.. కేసుల నమోదు మరింత ఎక్కువ అవుతుందన్న ఆలోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది.

అందుకే.. కొన్ని రాష్ట్రాల్లో బార్లు ఓపెన్ చేసినా.. తెలంగాణలో మాత్రం అలాంటి నిర్ణయాన్ని ప్రకటించటం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా బార్ల లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది. ఈ కసరత్తు చూస్తుంటే.. త్వరలోనే బార్లకు తలుపులు తెరిచేందుకు వీలుగా ప్రక్రియను షురూ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. సుదీర్ఘంగా సాగిన లాక్ డౌన్ నేపథ్యంలో.. నెలల తరబడి బార్లు మూసేసిన నేపథ్యంలో బార్ల రెన్యువల్ కు విధించిన లైసెన్సు ఫీజుల్ని తగ్గించాలని కోరుతున్నారు. సబబుగా ఉన్న ఈ డిమాండ్ పై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News