ఈ సంక్రాంతి కోడి పందెంలో హైలెట్ ఇదే.. రూ.1.53 కోట్లు సొంతం

సంక్రాంతి అన్నంతనే కోడి పందేలు కామన్. అందునా గోదావరి జిల్లాల్లో ఈ పందాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.;

Update: 2026-01-16 03:57 GMT

సంక్రాంతి అన్నంతనే కోడి పందేలు కామన్. అందునా గోదావరి జిల్లాల్లో ఈ పందాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.అందుకు తగ్గట్లే ఈ ఏడాది సంక్రాంతికి హైలెట్ అన్న పందెం ఒకటి తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంది. రెండు పుంజుల మధ్య జరిగిన పోటీకి ప్రైజ్ మనీ అక్షరాల రూ.1.53 కోట్లు. అవును.. మీరు చదివింది కరెక్టే. గుడివాడ ప్రభాకర్ కు చెందిన సేతువ అనే పుంజుకు.. రాజమండ్రి రమేశ్ కు చెందిన డేగ అనే పుంజుకు మద్య జరిగిన పందెం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పైబోయిన వెంకటరామయ్య బరిలో జరిగిన ఈ పోటీ ఇప్పుడు అందరూ మాట్లాడుకునే పరిస్థితి.

ఈ పందెంలో డబ్బులు కాసేందుకు పందెం రాయుళ్లు భారీగా తరలి వచ్చిన పరిస్థితి. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన ఈ పోటీలో రాజమండ్రి రమేశ్ కు చెందిన డేగ విజేతగా నిలిచి.. తన యజమానికి ఏకంగా రూ.1.53కోట్లను తెచ్చి పెట్టింది. దీంతో.. ఇప్పుడు అతను అందరిని ఆకర్షిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతి పెద్ద భారీ పందెంగా చెబుతున్నారు. ఆసక్తికర అంశం ఏమంటే.. పందెం సందర్భంగా టైం.. మంచి ముహుర్తం చూసుకొని మరీ పందెం రాయుళ్లు తమ కోళ్లను బరిలోకి దించటం కనిపిస్తుంది.

మొత్తంగా ఎప్పటిలానే ఈ సంక్రాంతికి కోడి పందేల పోటీలు జోరుగా సాగాయి. మొదటి రోజు భోగికి రూ.100 కోట్ల మేర నగదు చేతులు మారినట్లుగా చెబుతున్నారు. సంక్రాంతి పండుగ రోజు కూడా అంతకు మించిన మొత్తం చేతులు మారినట్లుగా చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణ నుంచి భారీగా గోదావరి జిల్లాలకు రావటం.. కోడి పందేల్లో హుషారుగా పాల్గొనటం కనిపించింది.

ఎప్పటిలానే పండక్కి ముందు కోడి పందేలు.. జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన పోలీసు ప్రకటనలు ఎక్కడా పని చేసింది లేదు. పోలీసు ప్రకటనలు పోలీసులవే.. పందెం రాయుళ్ల హడావుడి పందెం రాయుళ్లదే అన్నట్లుగా మారింది. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. సంక్రాంతి వేళ సాగే సంబరాలు మాత్రం అలానే కంటిన్యూ అయ్యే పరిస్థితి.


Tags:    

Similar News