కొణతాల రాజకీయం... శుభం కార్డు పడినట్టేనా?

Update: 2019-07-13 17:30 GMT
కొణతాల రామకృష్ణ... దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాకా ఉద్దండ రాజకీయవేత్తలకు చాలా ఇష్టమైన నేత. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అయితే ప్రీతిపాత్రమైన నేత కిందే లెక్క. విశాఖ జిల్లా ప్రత్యేకించి విశాఖ నగరానికి చెందిన కొణతాల క్లియర్ ఇమేజీ ఉన్న పొలిటీషియన్ గా తనదైన ముద్రను సంపాదించుకున్నారు. ఎంపీగా- ఎమ్మెల్యేగా- మంత్రిగా ఎన్ని పదవులు అలంకరించినా కొణతాలపై ఇప్పటిదాకా చిన్న అవినీతి మరక కూడా అంటలేదంటేనే ఆయన ఏ తరహా రాజకీయ వేత్తో ఇట్టే చెప్పేయొచ్చు. వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగిన కొణతాల... వైఎస్ అకాల మరణంతో క్రమంగా ఫేడ్ అవుట్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు అసలు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటంటే... అసలు చెప్పడానికేమీ లేదు, ఇక చాప చుట్టేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ తరహా పరిస్థితికి కొణతాల స్వయంకృతాపరాధమేనన్న వాదన కూడా వినిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన కొణతాలకు రాజశేఖరరెడ్డి మాదిరే జగన్ కూడా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్సీపీ పేరిట జగన్ కొత్త పార్టీ పెడితే... కొణతాల కూడా జగన్ వెంటే నడిచారు. ఈ క్రమంలో పార్టీలో కీలక బాధ్యతలను జగన్ అప్పగిస్తే... వాటిని కొణతాల తనదైన స్థాయిలో నిర్వహించి మెప్పించారు. అయితే ఏమైందో తెలియదు గానీ... కొణతాలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో కొణతాల పొలిటికల్ కెరీర్ డోలాయమానంలో పడిపోయింది. వైసీపీ బహిష్కరించాక... ఏ పార్టీలో చేరకుండా ఉత్తరాంద్ర ఐక్య వేదిక పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్న కొణతాల ఉత్తరాంధ్ర హక్కుల కోసం పోరాటం చేశారు.
Read more!

2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినా... కొణతాల వైసీపీ వైపే మొగ్గు చూపారు. ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో జగన్ కూడా కొణతాలకు రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికారు. జగన్ ఆహ్వానాన్ని మన్నించి వైసీపీ వైపు వచ్చినట్టే కనిపించిన కొణతాల... చివరి క్షణంలో సైడై పోయారు. తనకు జారీ చేసిన బహిష్కరణ నోటీసులను వెనక్కు తీసుకోవాలంటూ సరికొత్త వాదన వినిపించిన కొణతాల జగన్ కు దూరం జరిగారు. అలా కాకుండా వైసీపీలోనే ఉండి ఉంటే... ఇప్పుడు ఎంపీ పదవిలోనే లేదంటే ఏకంగా మంత్రి పదవిలోనే కొణతాల ఉండేవారని ఆయన శ్రేయోభిలాషులు చెబుతున్నారు. డబ్బే పరమావధిగా సాగుతున్న రాజకీయాల్లో కొణతాల లాంటి నేతలు చాలా అరుదుగానే ఉంటారని, అలాంటి అరుదైన లక్షణాన్ని ఉంచుకుని కూడా కొణతాల తననను తాను రాజకీయాల నుంచి బహిష్కరించకున్నారా? అన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
    

Tags:    

Similar News