మరో రాష్ట్ర డిమాండ్ రాకూడదనే 3 రాజధానులు

Update: 2020-01-20 07:50 GMT
ఏపీకి 3 రాజధానుల బిల్లును అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దానికి గల కారణాలను విశ్లేషణాత్మకంగా వివరించారు. వందేళ్ల క్రితం నాటి నుంచే తెలుగువాళ్లు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారని.. వెనుకబడిన ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తూనే ఉన్నాయని అందుకే ఏపీకి 3 రాజధానుల ఆవశ్యకతను గుర్తించి అమలు చేస్తున్నామన్నారు.

ఆంధ్రా రాష్ట్రం, తెలంగాణ ఏర్పాటు, విడిపోవడం తర్వాత కాలంలో ఆంధ్రాకు అన్యాయం జరిగిందని ఆర్థికమంత్రి బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని ఉప ప్రాంతాల నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్నాయని.. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయన్నాన్నారు. ఎవరికి ఇబ్బందులు కలుగకుండా 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా శివరామకృష్ణన్ కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీలు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెప్పారని మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు.

ఏపీలో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రాకుండా, తెలంగాణ లాగా విడిపోకుండా ఉండడానికే ఈ అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక అమరావతి ప్రాంతం కూడా రాజధాని నిర్మాణానికి అనువుగా లేదని మంత్రి బుగ్గన లెక్కలు చెప్పారు. ఇక్కడి నేల కేవలం 9 టన్నులు మాత్రమే బరువు భరిస్తుందని.. హైదరాబాద్ 30 టన్నులు భరిస్తుందని తెలిపారు.

నిపుణులతో కాకుండా చంద్రబాబు.. నారాయణ వంటి వ్యాపారస్తులతో కమిటీ వేయించి ఆర్థికంగా దోచుకునేందుకే ‘అమరావతి’ని నిర్ణయించి దోచుకున్నారని లెక్కలతో సహా బుగ్గన విడమర్చి టీడీపీ నేతలను ఎండగట్టారు.
Tags:    

Similar News