విమ‌ల‌క్క ఆఫీస్ సీజ్‌..అస‌లేం జ‌రుగుతోంది?

Update: 2016-12-03 05:21 GMT
తెలంగాణ‌లో అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌స్తుత పాల‌కుల‌తో కలిసి సాగిన తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ - అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాన్ని పోలీసులు రాత్రి సీజ్‌ చేశారు. ఈ కార్యాలయం కేంద్రంగానే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానంతో చిక్కడపల్లి పోలీసుల సహకారంతో తాము సీజ్‌ చేశామని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్న విమలక్కను - కార్యకర్తలను మహిళా పోలీసులు బలవంతంగా బయటకు పంపారు. తెలంగాణ ఉద్యమంలో విమలక్క - కార్యకర్తలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ను వ్యతిరేకించిన విమలక్క తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ (టఫ్‌)ను స్వతహాగా ఏర్పాటుచేసి ఉద్యమ కార్యకలాపాలు నిర్వహించారు.

ఇలా సొంత వేదిక‌ను ఏర్పాటు చేసుకున్న టఫ్‌ కు విమలక్క అధ్యక్షురాలుగా వ్యవహరిస్తుండగా - భీంభరత్‌ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. భీంభరత్‌ గురువారం కనిపించకుండా పోయేసరికి - పోలీసులే అరెస్టు చేసి ఉంటారని భావించిన విమలక్క బృందం శుక్రవారం సాయంత్రం దోమలగూడ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకర్ల సమావేశం ముగిసిన తర్వాత పోలీసులు దోమలగూడ కార్యాలయానికి భీంభరత్‌ ను నేరుగా తీసుకొచ్చారు. తమ కార్యాలయం ఇదేనని భీంభరత్‌ చెప్పడంతో పోలీసులు సోదాలు నిర్వహించి, విప్లవ సాహిత్యానికి చెందిన కొన్ని పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం ఉన్నందున కార్యాలయాన్ని సీజ్‌ చేస్తున్నట్టు కామారెడ్డి సీఐ కోటేశ్వర్‌ రావు మీడియాకు తెలిపారు.
Read more!

తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కార్యదర్శి భీంభరత్‌ పై నిజామాబాద్‌ జిల్లాలో పలు కేసులున్నట్టు పోలీసులు చెబుతున్నారు. గతేడాది భీంభరత్‌ ను పోలీసులే కిడ్నాప్‌ చేశారని విమలక్క ప్రెస్‌ మీట్‌ లో చెప్పారు. వీటిలో భాగంగానే గతేడాది భీంభరత్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. మళ్లీ, తాజాగా భీంభరత్‌ గురువారం అదృశ్యం కావడంపై పోలీసులపైనే అనుమానం వచ్చింది. విప్లవ సాహిత్యం, 20 డిటోనేటర్లు లభించినందున భీం భరత్‌ ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా దోమలగూడలోని అరుణోదయ కార్యాలయాన్ని భీంభరత్‌ ద్వారానే తెలుసుకుని సీజ్‌ చేయడం విశేషం. విషయం తెలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి విమలక్క కార్యాలయానికి వచ్చి - ఆమెకు సంఘీభావం తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా విమ‌ల‌క్క కార్యాల‌యం సీజ్ పై తెలంగాణ వాదుల్లోనే కొంద‌రిలో అసంతృప్తి నెల‌కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News