కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఫ్రెండ్స్ కోసం ప్రచారానికి వెళ్లలేదెందుకో?

Update: 2019-04-19 15:54 GMT
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఆయన్ను గట్టిగా విమర్శించే సాహసం కూడా ఎవరూ చేయడం లేదు. కానీ... ఒకప్పటి ఆయన రాజకీయ సోదరి.. ఆ తరువాత వేరు దారిపట్టి కాంగ్రెస్‌ లో చేరిన విజయశాంతి మాత్రమే ఆయన్ను పదునైన విమర్శలతో ఇరుకునపెడుతున్నారు. తాజాగా ఆమె కేసీఆర్‌ ను ఉతికి ఆరేశారు.
   
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌ గా ఉన్న విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. నిన్నమొన్నటిదాకా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో విపరీతమైన హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థంకావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
   
ప్రధానంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్.. జాతీయ పార్టీ స్థాపనపై ఆమె సెటెర్లు వేశారు. "జాతీయ పార్టీలను ఏకం చేస్తాను - ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను అని కేసీఆర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ - తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి వరుసగా సమావేశాలు జరిపారు. మరి ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ గురించి ఎలాంటి ఊసూ లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామికి అన్నీ తానై గెలిపించానని కేసీఆర్ చెప్పుకున్నారు. మరి లోక్ సభ ఎన్నికల వేళ ఒక్కసారి కూడా కర్ణాటకలో ఎందుకు అడుగుపెట్టలేదో ఆయనే సమాధానం చెప్పాల’’న్నారు.
   
‘‘జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగడతానని నానా హంగామా చేసి ఇప్పుడా విషయాన్ని గాలికొదిలేశారు. తాను గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఎవరెవర్ని కలిశాడో కనీసం వాళ్ల తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్లడంలేదు. దానర్థం, కేసీఆర్ మాట ఫెడరల్ ఫ్రంట్ వైపు - మనిషి మాత్రం మోదీ వైపు అని స్పష్టమవుతోంది" అంటూ గాలి తీసేశారు.


Tags:    

Similar News