మాన్సాస్ ట్రస్టుపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Update: 2021-06-17 04:30 GMT
గడిచిన రెండు రోజులుగా వార్తల్లోకి వచ్చిన మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రస్టు పరిధిలోని వేలాది ఎకరాల భూమిపై ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మాన్సాస్ ట్రస్టు కింద 14వేల ఎకరాల భూమి ఉందన్నారు.

ఈ భూమిని రక్షించాల్సిన బాధ్యత ఏపీ సర్కారు మీద ఉందని.. ఆ బాధ్యతను తాముసక్రమంగా నిర్వహిస్తామని చెప్పారు. అంతేకాదు.. ఆ ట్రస్టు కింద పద్నాలుగు విద్యా సంస్థలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అనూహ్యంగా ట్రస్టు పరిధిలోని విద్యా సంస్థల్లో గడిచిన పదేళ్లుగా ఆడిటింగ్ జరగలేదని.. ఒకవేళ అందులో అవకతవకలు జరిగినట్లుగా తేలితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అదే సమయంలో ట్రస్టు భూముల్ని దొంగ జీవోల్ని తీసుకొచ్చి అమ్మినట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. ట్రస్టు భూముల్ని అమ్మాలంటే కోర్టు అనుమతి ఉండాలని.. నిబంధనల్ని పట్టించుకోకుండా దొంగ జీవో తీసుకొచ్చి భూముల్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేశారన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. దేవాలయ భూముల్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఆయన.. సింహాచలం భూముల పరిరక్షణకు ప్రహరీగోడ నిర్మించనున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News