ఎండల్లోవెంకయ్య సూటు బూటు వెనుక?

Update: 2015-10-09 04:41 GMT
సంప్రదాయ దుస్తులతో అలరించే కేంద్రమంత్రి వెంకయ్య.. తాజాగా వేసుకున్న సూటుబూటు వ్యవహారం ఆసక్తిని రేపింది. తెల్లటి పంచె.. అదే రంగున్న చొక్కాతో భారతీయ సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే ఆయన అందుకు భిన్నంగా.. సూటు బూటు వేసుకొని.. మెడలో టై లేకుండా కాస్త వింతగా.. విచిత్రంగా కనిపించారు. ఆయన ఎందుకలా కనిపించారన్నది ఆసక్తిగా మారింది.

సాధారణంగా విదేశాల్లో మాత్రం ఇలాంటి డ్రెస్ వేసుకునే వెంకయ్య తాజాగా ఢిల్లీలో.. అందులోనూ మండే ఎండల్లో ఇలాంటి డ్రెస్సు ఎందుకు వేసుకున్నారన్న సందేహం పలువురికి వచ్చింది.

వెంకయ్య దగ్గర ఆయన డ్రెస్సు గురించి ప్రస్తావించారో లేక.. అటూఇటూ కాకుండా ఉన్న తన వస్త్రధారణ గురించి వివరణ ఇవ్వాలనుకున్నరో కానీ.. మొత్తంగా తన సూటు బూటు వెనుకున్న అసలు కథ చెప్పేశారు.

గురువారం ఢిల్లీలోని ఫిక్కీ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు సూటుబూటు వేసుకున్న వెంకయ్య రావటంతో ఒక్కసారి అవాక్కు అయిన పరిస్థితి. భారత్ లో ఆయన ఇలాంటి వేషధారణతో చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే అస్సలు కనిపించరనే చెప్పాలి. అయితే.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి వేషధారణతో రావాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పుకోవటంతోపాటు.. పని పట్ల తనకున్న కమిట్ మెంట్ ను చెప్పకనే చెప్పేశారు.

ఆరు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ కు వెళ్లారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. సాధారణంగా ఏదైనా సదస్సు నిర్వహించినప్పుడు చివరి రోజు.. సైట్ సీయింగ్ కోసం కేటాయిస్తారు.  అదే విధంగా వెంకయ్య మాజరైన సదస్సులోనే అలాంటి పరిస్థితే. అయితే.. తానొచ్చిన పని ముగియటంతో సైట్ సీయింగ్.. అతిధి మర్యాదల్ని పక్కన పెట్టేసిన వెంకయ్య నేరుగా భారత్ కు వచ్చేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలోదిగిన ఆయన నేరుగా ఫిక్కీ సదస్సు కు హాజరయ్యారు. విదేశీ పర్యటన ముగించుకొచ్చిన వారు సహజంగా ఇంటికి వెళ్లి కాస్తంత విశ్రాంతి తీసుకొని వస్తారు. కానీ.. సమయపాలన.. క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వెంకయ్య తాను హాజరు కావాల్సిన సమావేవానికి వచ్చే పనిలో భాగంగా.. ఇంటికి వెళ్లి రిఫ్రెష్ కాకుండానే సదస్సుకు హాజరయ్యారు. దీంతో.. ఆయన రెగ్యులర్ పంచె.. చొక్క స్థానే సూటు బూటుతోనే రావాల్సి వచ్చింది. అదీ.. వెంకయ్య టై లేని సూటుబూటు వెనుకున్న అసలు విషయం.
Tags:    

Similar News