ఈ నేతలకు సిగ్గు అన్నది అసలు ఉండదా?

Update: 2015-09-27 04:33 GMT
జనాలకు నీతులు చెబుతూ.. ప్రజా సేవ చేయటానికి తాము పుట్టినట్లుగా గొప్పలు చెప్పుకునే కొందరి నేతల తీరు చూస్తే విస్మయం కలిగించక మానదు. సిగ్గు అన్న పదార్థం ఏ కోశాన లేనట్లుగా వారు వ్యవహరిస్తుంటారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు..  ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. అధికారం చేజారిన కొత్త నీరు వచ్చాక గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని రద్దు చేయటం.. కొంగొత్త నిర్ణయాలు తీసుకోవటం మామూలే.

పవర్ లేని నేతలకు ప్రభుత్వపరంగా వసతులు కొనసాగించాలన్నది ఏ మాత్రం సరైన అంశం కాదు. ఉదాహరణకు దివంగత నేత అర్జున్ సింగ్ ఫ్యామిలీ వ్యవహారమే తీసుకుందాం. ఆయన మరణించిన తర్వాత ఢిల్లీలోని కేనంగ్ లేన్ భవనంలో ఉండటానికి ఆయన సతీమణికి యూపీఏ సర్కారు అవకాశం ఇచ్చింది. ఒక నేత 2011 మరణిస్తే.. ఆ కుటుంబ ప్రభుత్వానికి చెందిన భవనంలో ఐదేళ్ల పాటు ఉండేలా అనుమతులు ఎలా ఇస్తారన్నది వారికే తెలియాలి.

అయితే.. ఈ నిర్ణయాన్ని మోడీ సర్కారు రద్దు చేసింది. ఇల్లు ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలు నోటీసులు జారీ చేసింది. అయినా.. వారు మాత్రం ఏ మాత్రం స్పందించలేదు సరి కదా తమను కాదన్నట్లు ఊరుకున్న పరిస్థితి. ఇది ఒక్క అర్జున్ సింగ్ ప్యామిలీకి మాత్రమే కాదు.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వీరభద్రసింగ్ కు మాజీ కేంద్రమంత్రి గా ఢిల్లీలో ఒక భవనాన్ని కేటాయించారు. ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్న ఆయన.. ఢిల్లీలో భవన వసతిని కొనసాగిస్తున్నారు. కేంద్రం ఆ వసతిని రద్దు చేసినా..ఆయన మాత్రం ఇంటిని ఖాళీ చేయని పరిస్థితి.

ఇలాంటిదే.. మరో మాజీ కేంద్రమంత్రి ఉన్నారు. కాశ్మీర్ కు చెందిన ఫరూఖ్ అబ్దుల్లాకు తీన్ మూర్తి లేన్ లోని ప్రభుత్వ భవనంలో ఉన్నారు. మాజీ కేంద్రమంత్రికి ఇంటి వసతి ఎలా కల్పిస్తారన్నది ఎవరూ అడగరు.. పెద్దగా పట్టించుకోరు. ఖాళీ చేయమని గత 15 నెలల కాలంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకున్నదే లేదు. పదవి పోయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి ప్రజల సొమ్మును.. తినేస్తూ కాలం  గడపటం కొందరు నేతలకు చెల్లుతుంది. నోటీసుల్ని పట్టించుకోకుండా ఉండే ఇలాంటి నేతలకు సిగ్గు అనే పదార్థం పెద్దగా ఉన్నట్లు కనిపించదు. తాజాగా ఇలాంటి నేతలకు కేంద్ర ప్రభుత్వం ఫైనల్ నోటీసులు జారీ చేసి.. వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని తాఖీదులు ఇచ్చింది. మరి.. ఈసారైనా ఇళ్లు ఖాళీ చేస్తారా? లేక.. కిమ్మనకుండా ఉండిపోతారా అన్నది చూడాలి.
Tags:    

Similar News