ఇండక్షన్ స్టౌల డిమాండ్ కు.. చైనాకు లింకేంటి సామీ?
జరిగిపోతున్నంత కాలం జరిగిపోతున్నట్లే ఉంటుంది. ఆయా అంశాల అవసరం వాటికి సంబంధించిన కొత్త విషయాల మీద అవగాహన పెంచేలా చేస్తుంది.;
జరిగిపోతున్నంత కాలం జరిగిపోతున్నట్లే ఉంటుంది. ఆయా అంశాల అవసరం వాటికి సంబంధించిన కొత్త విషయాల మీద అవగాహన పెంచేలా చేస్తుంది. తాజాగా వచ్చిన పడిన యుద్ధం.. దాని కారణంగా ఎదురైన గ్యాస్ కొరత.. దాన్ని అధిగమించేందుకు తెరపైకి వచ్చాయి ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టౌవ్ లు. గ్యాస్ పొయ్యిలకు ప్రత్యామ్నాయంగా ఉన్న వీటి కొనుగోలుపై దేశ ప్రజలు ఆసక్తి చూపటంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న అంచనాలు మొదలైన రెండు రోజుల వ్యవధిలోనే దేశంలోని ఇండక్షన్ స్టౌలకు కొరత ఏర్పడింది. దీంతో.. ఒక్కసారి వీటి ఉత్పత్తి మీద చర్చ మొదలైంది.
ఈ సమయంలో వెల్లడైన వివరాలు అందరిని ఆశ్చర్యానికి గురికావటమే కాదు.. చైనా మీద మనం ఇంతలా ఆధారపడ్డామా? అన్న ఆలోచనలో పలువురిలో మొదలైంది. అంతేకాదు.. ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టవ్ లను తయారు చేసే పరిస్థితులు లేవని.. చైనా నుంచి రావాల్సిన ముడి పదార్థాల మీద ఆధారపడటంతో.. వీటి కొరతను అధిగమించేందుకు తక్కువలో తక్కువ 45 రోజులు పడుతుందని చెబుతున్నారు. అయితే.. దేశ వ్యాప్తంగా ఉన్న ఇండక్షన్ స్టవ్ తయారీదారులు తమ వద్ద ఉన్నకొద్దిపాటి ముడి పదార్థాలతో ఉత్పత్తి మొదలు పెట్టారని.. దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో పోలిస్తే.. సప్లై అత్యంత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
రానున్న వారం వ్యవధిలో జరిగే ఉత్పత్తి తర్వాత.. మళ్లీ ఉత్పత్తి చేసేందుకు చైనా మీద ఆదారపడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ మరో మూడు నాలుగు రోజుల్లో రానున్న నేపథ్యంలో వంట గ్యాస్ కొరతతో.. ప్రత్యామ్నాయం కోసం ఇండక్షన్ స్టవ్ ల మీద ఆధారపడుతున్నారు. దీంతో ఆఫ్ లైన్ లో మాత్రమే కాదు. ఆన్ లైన్ లోనూ ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టవ్ ల కోసం ఒక్కసారిగా 500 శాతం వరకు డిమాండ్ పెరిగినట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
గ్యాస్ కొరతకు ముందు వరకు రూ.3 వేల వరకు ఉన్న ఇండక్షన్ స్టౌవ్ ల ధరలు ఇప్పుడు రూ.5 వేల వరకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. గతంలో నెలకు వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల అమ్మకాలు సాగే చోట.. ఇప్పుడు రోజుకు పది వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇంత డిమాండ్ నెలకొనటానికి మరో కారణం లేకపోలేదు. ఇప్పుడున్న గ్యాస్ కొరత మే రెండు వారం వరకు ఉండే అవకాశం ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండక్షన్ స్టౌల తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ.. ఇతర ఎలక్ట్రానిక్ విడి భాగాల కోసం చైనా మీదే ఆధారపడుతున్న పరిస్థితి. వీటి కోసం ఇప్పుడు 45 రోజుల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. రోజువారీ ఇంట్లో ఉపయోగించే ఇండక్షన్ స్టవ్ లో వినియోగించే విడి పదార్థాలకు సైతం చైనా మీదే పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం చూసినప్పుడు.. స్వయంసంవృద్ధికి మనం మరెంత ప్రయాణించాల్సి ఉంటుందన్నది ఆలోచనల్లో పడేలా చేస్తుంది. నిజానికి తాజా యుద్ధం భారత దేశ గమనం రానున్న రోజుల్లో ఎలా ఉండాలన్నది దిశానిర్దేశం చేసిందని చెప్పక తప్పదు.