టచ్ చేసి చూడు..జుకర్‌ బర్గ్‌ కు ఇండియా వార్నింగ్

Update: 2018-03-21 14:38 GMT
అమెరికా ఎన్నికల్లో - బ్రిటన్‌ లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణలో ఫేస్‌ బుక్ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ అనే సంస్థ ఫుల్లుగా ఉపయోగించకుందని.. యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటిక్స్ కు అందివ్వడంలో ఫేస్ బుక్ పాత్ర ఉందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా ఫేస్‌ బుక్ సంస్థను తీవ్రంగా హెచ్చరించింది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్ బుక్ సీఈవో జుకర్‌ బర్గ్‌ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో 2019లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
    
ఇండియాలో జరిగే ఎన్నికల్లో వేలుపెడితే ఊరుకోబోమని ఆయన అన్నారు. భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చోరి చేసినట్టు తెలిస్తే సమన్లు పంపుతామని  మార్క్ జుకర్ బర్గ్‌ను హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛకు తాము అడ్డుకాదని.. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే చట్ట పరమైన చర్యలను తీసుకొంటామని హెచ్చరించారు.
    
అమెరికా తర్వాత ఫేస్‌ బుక్‌ కు అతి పెద్ద మార్కెట్‌ భారతేనని.. 20 కోట్ల మంది భారతీయులు ఫేస్‌ బుక్‌ ను ఉపయోగిస్తున్నారని .. ఏ చిన్న తేడా చేసినా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు.  అలాంటి ప్రయత్నాలు చేస్తే ఐటీ చట్టం కింద  కఠిన చర్యలు తీసుకునే వీలుందని...  ఆ చట్టం కింద జుకర్‌ బర్గ్‌ ను భారత్‌ కు రప్పించడానికి,  సమన్లు జారీ చేయడానికి వెనుకాడబోమని  రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్‍‌బుక్ ఖాతాల సమచారం చిక్కిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.
Tags:    

Similar News