జంపింగ్ ఎమ్మెల్యేల ఫ్యూచ‌రేంటి? పొలిటిక‌ల్ డిబేట్‌!

Update: 2021-08-08 23:30 GMT
రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. ఆనుపానులు గుర్తించి నాయ‌కులు అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే.. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. ఇప్పుడు కొంద‌రు నేత‌ల‌కు ఫ్యూచ‌ర్ లేకుండా చేస్తున్నాయ‌నే వాద‌న వినిపించేలా చేస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొంద‌రిని త‌న పార్టీలోకి చేర్చుకున్నారు. వీరిలో చాలా మందికి ప్రాధాన్యం ఇచ్చారు. కొంద‌రిని మంత్రుల‌ను కూడా చేశారు. అయితే.. 2019 త‌ర్వాత ఇలానే టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేల్లో న‌లుగురు నేరుగా వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.

వీరు అధికారికంగా.. టీడీపీ ఎమ్మెల్యేలే అయినా(రాజీనామా చేయ‌లేదు. వైసీపీ కండువా క‌ప్పుకోలేదు) వైసీపీకి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు. అయితే.. గ‌తంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల‌కు ద‌క్కిన గౌరవంలో వీస‌మెత్తుకూడా వీరికి వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా ద‌క్కుతుందో లేదో చెప్ప‌లేమ‌ని అంటున్నారు. దీంతో వీరి భ‌విత‌వ్యం ఏంటి?  ఏం జ‌రుగుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

2019 ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీదెబ్బ‌తిన్నా.. 23 మంది విజ‌యం సాధించారు. వీరిలో  గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరి, చీరాల ఎంఎల్ఏ కరణం బలరాం, విశాఖ ధక్షిణం ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ లు టీడీపీకి రాం రాం చెప్పి.. వైసీపీతో చేతులు క‌లిపారు.  చంద్రబాబుకు, ఆయ‌న పార్టీకి దూరమయ్యారు. అయితే.. ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మ‌ద్ద‌తుగా మారినా ఆశించిన ప్ర‌యోజ‌నం.. గుర్తింపు అధికార పార్టీలో ల‌భించ‌డం లేద‌నేది విశ్లేష‌కుల మాట‌. వీరు కూడా ఇదే భావ‌న‌తో ఉన్నారు. వాస్త‌వానికి చంద్రబాబును తిడితే.. ఆ పార్టీకి దూరం జ‌రిగితే.. అధికార పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుంద‌ని సీఎం జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకుంటారని అనుకున్నారు.

అయితే, వైసీపీలోనే బోలెడు మంది సీనియ‌ర్లు ఉండ‌డం.. వారికే త‌గిన గుర్తింపు ఇవ్వ‌లేని ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి వారు ఆశించిన‌ట్టు జ‌ర‌గ‌డం లేద‌నేది వాస్తవం. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌నుతిట్టిపోసి.. ఆ వెంట‌నే పార్టీకి చేరువైనా.. వైసీపీ నేత‌లు వీరిని అంగీక‌రించ‌లేక పోతున్నారు. ఇదే.. మ‌న‌కు చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు, ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచి.. త‌ర్వాత వైసీపీకి చేరువైన క‌ర‌ణంకు మ‌ధ్య జ‌రుగుతున్న పోరు క‌నిపిస్తోంది.  ఇది ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం కాలేదు.

 వైసీపీతోనే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీ నేతలు, క్యాడర్ తో మాత్రం కలవలేకపోతున్నారు. ఈ నలుగురి ఆధిపత్యాన్ని ఆయా నియోజకవర్గాల్లోని నేతలు అంగీకరించలేదు. దాంతో రెగ్యులర్ గా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు గమనించిన జగన్ కూడా టీడీపీ ఎంఎల్ఏలకు పార్టీపరంగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీనికితోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి టికెట్లు ల‌భిస్తాయా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఇదిలావుంటే.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు శాస‌న స‌భ్యుడు రాపాక వ‌ర‌ప్ర‌సాద్. ఈయ‌న కూడా ఓ కేసు విష‌యంలో జ‌రిగిన వివాదం త‌ర్వాత‌.. వైసీపీకి చేరువ‌య్యారు.

ప‌వ‌న్ పార్టీకి రాజీనామా చేయ‌క‌పోయినా.. బ‌హిరంగంగానే ఆయ‌న వైసీపికి మ‌ద్ద‌తిస్తున్నారు. అధికారిక కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటున్నారు. అయితే, రాపాక కూడా ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయలేదు. కానీ తనను తాను వైసీపీ ఎంఎల్ఏగానే ప్రొజెక్టు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే, రాపాక‌కు రాజోలు వైసీపీ నేతలకు ఎక్క‌డా పొస‌గ‌డం లేదు.  వైసీపీలోనే అమ్మాజీ స‌హా మూడు వర్గాలు ఉండటంతో వాళ్ళకి, రాపాకకు మధ్య ప్రతిరోజు ఏదో విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ జంపింగుల ప‌రిస్థితి ఏంటి?  అస‌లు వీరికి టికెట్లు ల‌భిస్తాయా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News